Loading...
Electric,CNG and Hydrogen Vehicles: ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. 20 ఏళ్ల వరకు అనుమతి?
ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. 20 ఏళ్ల వరకు అనుమతి?

Electric,CNG and Hydrogen Vehicles: ఎలక్ట్రిక్‌, సీఎన్‌జీ వాహనాలకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. 20 ఏళ్ల వరకు అనుమతి?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలక్ట్రిక్‌,హైడ్రోజన్‌, సీఎన్‌జీ వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది. జాతీయ పర్మిట్‌ పరిధిలో నడిచే వాణిజ్య వాహనాల గరిష్ఠ వయసును మరో ఐదేళ్లు పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం జాతీయ పర్మిట్‌ పరిధిలో ఉన్న కొన్ని వాణిజ్య వాహనాలకు గరిష్ఠంగా 12ఏళ్ల వయోపరిమితి ఉండగా.. మరికొన్ని వాహనాలకు 15ఏళ్ల వరకు అనుమతి ఉంది. కేంద్రం ప్రతిపాదించిన మార్పులు అమల్లోకి వస్తే బ్యాటరీ,హైడ్రోజన్‌, సహజ వాయువుతో నడిచే వాహనాల వయోపరిమితి గణనీయంగా పెరగనుంది. ఎలక్ట్రిక్‌, హైడ్రోజన్‌, సీఎన్‌జీ వాహనాలకు వరుసగా 17 ఏళ్లు, 20 ఏళ్ల వరకు గరిష్ఠ వయసును పెంచే అవకాశం ఉంటుంది.

వివరాలు 

పర్మిట్‌ విషయంలోనూ వెసులుబాటు

అయితే ఈ సడలింపు అన్ని రకాల కమర్షియల్‌ వాహనాలకు వర్తించదు. బ్యాటరీ, హైడ్రోజన్‌, సహజ వాయువు వంటి తక్కువ కాలుష్య ఉద్గారాలతో నడిచే వాహనాలకు మాత్రమే ఈ ప్రతిపాదన పరిమితం కానుంది.

కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణహితమైన వాణిజ్య రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మార్పులను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

జాతీయ పర్మిట్‌ కలిగిన వాహన యజమానులకు మరో సౌకర్యాన్ని కల్పించాలని కేంద్రం ప్రతిపాదించింది.

ప్రస్తుతం పర్మిట్‌ ఆథరైజేషన్‌ను ప్రతి ఏడాది పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది.

కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఒకేసారి ఐదేళ్ల కాలానికి ఆథరైజేషన్‌ తీసుకునే అవకాశం ఉంటుంది.

దీనికి ప్రతి ఏడాది రుసుము రూ.16,500గా కొనసాగుతుంది. ఐదేళ్లకు కలిపి మొత్తం రూ.82,500 చెల్లించాల్సి ఉంటుంది.

వివరాలు 

వాహన్‌ డేటాబేస్‌తో పేపర్‌వర్క్‌ తగ్గింపు

వాహనాలకు సంబంధించిన పత్రాల ప్రక్రియను కూడా మరింత సులభతరం చేయాలని కేంద్రం భావిస్తోంది.

ఇందుకోసం 'వాహన్‌' డేటాబేస్‌ను ఉపయోగించి అవసరమైన కాగితపు పనిని తగ్గించేందుకు ప్రతిపాదనలు చేసింది.

దీంతో వాహనాల పత్రాల నిర్వహణ ప్రక్రియ మరింత సులభంగా మారే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు 

తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లోనూ మార్పులు

బాడీ ఇంకా అమర్చని చాసిస్‌ వాహనాలకు సంబంధించిన తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నిబంధనల్లోనూ మార్పులను కేంద్రం ప్రతిపాదించింది.

ఇలాంటి చాసిస్‌కు ఆరు నెలల పాటు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ ఇవ్వాలని ప్రతిపాదించింది.

ప్రత్యేక పరిస్థితులు ఎదురైతే ఈ గడువును ఒక్కోసారి 30 రోజుల చొప్పున పొడిగించుకునే అవకాశం కల్పించనుంది.

అభిప్రాయాలకు 30 రోజుల గడువు

కేంద్రం విడుదల చేసిన ఈ ముసాయిదా నిబంధనలపై ప్రజలు, సంబంధిత రంగాలకు చెందిన వర్గాల నుంచి అభ్యంతరాలు, సూచనలను కోరింది.

నోటిఫికేషన్‌ ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తేదీ నుంచి 30 రోజుల్లోగా తమ అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.

వచ్చిన సూచనలు, అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది నిబంధనలపై కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ADVERTISEMENT