Loading...
E20 Fuel: ఈ20 పెట్రోల్‌తో ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవు: కేంద్రం
ఈ20 పెట్రోల్‌తో ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవు: కేంద్రం

E20 Fuel: ఈ20 పెట్రోల్‌తో ఇంజిన్ దెబ్బతిన్నట్లు ఆధారాలు లేవు: కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ20 (E20)పెట్రోల్ వల్ల దేశవ్యాప్తంగా వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయన్న ఆరోపణలకు ఎలాంటి నిర్ధారిత ఆధారాలు లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ20 ప్రమాణాలకు అనుగుణంగా తయారు కాని పాత వాహనాలతో సహా 23 కోట్లకు పైగా వాహనాలు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వినియోగిస్తున్నప్పటికీ,ఇంజిన్ దెబ్బతినడం లేదా వాహనాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఈ20 వల్లే వచ్చాయని నిరూపించే ఆధారాలు లేవని వెల్లడించింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు పెట్రోలియం,సహజవాయు శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ సమాధానం ఇచ్చారు. దేశంలో 20 కోట్లకు పైగా ద్విచక్ర వాహనాలు,3కోట్లకుపైగా పెట్రోల్ కార్లు ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని వినియోగిస్తున్నాయని,వీటిలో ఈ20 ప్రమాణాలకు ముందే తయారైన వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయని తెలిపారు.

వివరాలు 

2025-26 నాటికి 20 శాతానికి ఇథనాల్ మిశ్రమం

అయినప్పటికీ ఈ20 కారణంగా విస్తృత స్థాయిలో ఇంజిన్ సమస్యలు వచ్చినట్లు ఎలాంటి ధృవీకరించిన సమాచారం లేదని చెప్పారు.

దేశంలో ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ అమలు దశలవారీగా, శాస్త్రీయ ఆధారాల ఆధారంగా చేపట్టామని కేంద్రం తెలిపింది.

2013-14లో ఇథనాల్ మిశ్రమం 1.53 శాతంగా ఉండగా, విస్తృత పరిశోధనలు, నిపుణుల సూచనల తర్వాత 2025-26 నాటికి దాన్ని 20 శాతానికి పెంచినట్లు వివరించింది.

ఇథనాల్ శాతం పెంచే ప్రతి దశకు ముందు ప్రయోగశాల పరీక్షలు, దీర్ఘకాలిక పనితీరు పరీక్షలు, రోడ్లపై ప్రత్యక్ష పరిశీలనలు నిర్వహించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వివరాలు 

1.5 కోట్లకు పైగా ఈ20 ప్రమాణాలు లేని పాత వాహనాలే

నీతి ఆయోగ్, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ARAI), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (IIP), ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు, వాహన తయారీ కంపెనీలతో కలిసి ఈ అధ్యయనాలు చేపట్టినట్లు తెలిపింది.

ఇంజిన్ పనితీరు, ఇంధన వ్యవస్థ అనుకూలత, తుప్పు నిరోధకత, మైలేజ్, కాలుష్య ఉద్గారాలు, మొత్తం వాహన పనితీరును పరిశీలించినట్లు పేర్కొంది.

వాహన తయారీ సంస్థల సేవా వివరాలను కూడా కేంద్రం ఉదాహరణగా చూపించింది.

ఒక ప్రముఖ కార్ల తయారీ సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2.84 కోట్ల వాహనాలకు సర్వీసింగ్ నిర్వహించగా, వాటిలో 1.5 కోట్లకు పైగా ఈ20 ప్రమాణాలు లేని పాత వాహనాలేనని తెలిపింది.

ADVERTISEMENT

వివరాలు 

మైలేజ్ తగ్గుతుందన్న సందేహాలపై స్పందించిన కేంద్రం

అయినప్పటికీ ఈ20 ఇంధనం కారణంగా వాహనాలకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు లేవని పేర్కొంది.

మరో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కూడా ఈ20 వాడుతున్న వాహనాల్లో అదనపు నష్టం కనిపించలేదని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.

మైలేజ్ తగ్గుతుందన్న సందేహాలపై కూడా కేంద్రం స్పందించింది.

వాహనం నడిపే విధానం,రహదారి పరిస్థితులు,వాహన నిర్వహణ వంటి అనేక అంశాలపై ఇంధన వినియోగం ఆధారపడుతుందని తెలిపింది.

అయితే ఈ10 పెట్రోల్‌కు అనుగుణంగా రూపొందించిన కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ 3 నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంగీకరించింది.

మరోవైపు ఈ20 పెట్రోల్‌లో ఆక్టేన్ విలువ ఎక్కువగా ఉండటం,మెరుగైన దహన ప్రక్రియ, ఇంజిన్ సాఫీగా పనిచేయడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని వివరించింది.

ADVERTISEMENT

వివరాలు 

ఈ20 ఇంధనం వల్ల విస్తృత స్థాయిలో ఇంజిన్ నష్టం జరుగుతుందనే ఆధారాలు లేవు 

దేశవ్యాప్తంగా ఈ20 అమలయ్యాక మైలేజ్ తగ్గిందని, ఇంజిన్ సమస్యలు వస్తున్నాయని కొందరు వాహనదారులు చెబుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది.

శాస్త్రీయంగా ఈ20 ఇంధనం వల్ల విస్తృత స్థాయిలో ఇంజిన్ నష్టం జరుగుతుందనే ఆధారాలు లేవని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

ఇథనాల్ మిశ్రమాన్ని ప్రస్తుతం ఉన్న 20 శాతానికి మించి పెంచే అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం తెలిపింది.

వివరాలు 

ఇథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్‌ బంకుల్లో విక్రయించే ప్రతిపాదన లేదు 

భవిష్యత్తులో అలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వస్తే, శాస్త్రీయ అధ్యయనాలు, సాంకేతిక పరిశీలనలు, వాహన తయారీ సంస్థలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, పరిశోధనా సంస్థలతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.

అలాగే, సాధారణ పెట్రోల్ లేదా తక్కువ ఇథనాల్ మిశ్రమం ఉన్న పెట్రోల్‌ను ప్రత్యేకంగా కొన్ని పెట్రోల్ బంకుల్లో విక్రయించే ప్రతిపాదన కూడా ప్రస్తుతం లేదని కేంద్రం స్పష్టం చేసింది.

పర్యావరణానికి మేలు చేసే, పరిశుభ్రమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని కొనసాగించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపింది.

ADVERTISEMENT