ఎగిరే కారుకు గ్రీన్ సిగ్నల్.. ఇక త్వరలోనే గాల్లోకి!
ఇప్పుడు విమానాల్లో కాదు కార్లు కూడా గాల్లో ప్రయాణించనున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని మొట్టమొదటి ఎగిరే కారు ఫ్లైట్ సర్టిఫికెట్ అందింది. 177 కిలోమీటర్ల రేంజ్‌తో రూపొందించిన ఎలక్ట్రిక్ ఎగిరే కార్లను 2025 చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆలీఫ్ ఎయిరోనాటిక్స్ సంస్థ రూపొందించిన ఈ ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం నుంచి లీగల్ పరమైన అనుమతులు కూడా లభించాయి. యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఏఫ్ఏఏ) నుంచి ప్రత్యేకమైన ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికేషన్ ను పొందినట్లు కార్ కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఏవియేషన్ న్యాయ సంస్థ ఏరో లా సెంటర్ ప్రకారం ఈ తరహా వాహనం యూఎస్‌లో ఇలాంటి సర్టిఫికెట్ ఇదే తొలిసారి.
ఎగిరే కారు ధర రూ. 2.5 కోట్లు
కాలిఫోర్నియాలోని శాన్ మాటియో కేంద్రంగా రూపొందించిన ఈ కారు వందశాతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనం కావడం విశేషం. ఇందులో ఒకరు లేదా ఇద్దరు ప్రయాణించడానికి వీలుగా ఉంటుంది. రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు ఈ కారు గాల్లో ప్రయాణించే అవకాశం ఉంది. దీని ధర సూమారుగా రూ.2.5కోట్లు ఉండనుంది. 2022 అక్టోబర్లో ఓ పూర్తిస్థాయి స్పోర్ట్స్ వెహికిల్ను సైతం ఈ కంపెనీ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఇప్పటికే 440కి పైగా కస్టమర్ల నుంచి ముందస్తు ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ గత జనవరిలో వెల్లడించింది. ఇది రోడ్లపై గంటకు 25 మైళ్లకు మించి వేగంగా వెళ్లదని ఆలెఫ్ కంపెనీ సీఈఓ జిమ్ దుఖోవ్నీ గతంలో పేర్కొన్నారు.