LOADING...
Harley-Davidson: హార్లీ-డేవిడ్సన్ బైక్‌ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారత్‌లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు
భారత్‌లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు

Harley-Davidson: హార్లీ-డేవిడ్సన్ బైక్‌ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారత్‌లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 09, 2026
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికా మధ్య కుదరబోయే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో హార్లీ-డేవిడ్సన్ బైక్‌ల ధరలు తగ్గే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వస్తే 800 నుంచి 1,600 సీసీ, అలాగే అంతకుమించిన ఇంజిన్ సామర్థ్యం ఉన్న అమెరికన్ మోటార్‌సైకిళ్లపై కేంద్ర ప్రభుత్వం జీరో డ్యూటీ సౌకర్యం కల్పించనుందని పీటీఐకి ఓ అధికారి తెలిపారు. మార్చి మధ్య నాటికి ఈ ఒప్పందానికి ఆమోదం లభించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటివరకు అమెరికా నుంచి దిగుమతి చేసే ప్రీమియం వాహనాలపై పన్నులు కలిపి 110 శాతం వరకు ఉండగా, ఇవి 30 శాతం వరకూ తగ్గే ఛాన్స్ ఉందని రాయిటర్స్ పేర్కొంది.

వివరాలు 

సుంకాలు తగ్గించాలని ట్రంప్ ఒత్తిడి

ఇప్పటికే 2025లో ప్రభుత్వం 1,600 సీసీ వరకు ఉన్న బైక్‌లపై దిగుమతి సుంకాన్ని 50 శాతం నుంచి 40 శాతానికి, 1,600 సీసీలకు మించిన వాటిపై 30 శాతానికి తగ్గించింది. గతంలో తక్కువ అమ్మకాల కారణంగా 2020లో హార్లీ భారత్ నుంచి తప్పుకున్నప్పటికీ, అదే ఏడాది హీరో మోటోకార్ప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుని మళ్లీ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ రంగంలో సుంకాలు తగ్గించాలని ఒత్తిడి తీసుకురావడంతో తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

వివరాలు 

హైఎండ్ వాహనాల ధరలు తగ్గితే.. వినియోగదారులకు ఊరట కలిగే అవకాశాలు

మరోవైపు, భారత ఆటోపార్ట్స్ ఎగుమతులకు అమెరికాలో జీరో టారిఫ్ ఉంటుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రం ఇప్పట్లో ఎలాంటి సడలింపులు లేవని అధికారులు స్పష్టం చేయడంతో టెస్లాకు నిరాశ ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, ఈ వాణిజ్య ఒప్పందం అమలైతే ప్రీమియం బైక్‌లు, కొన్ని హైఎండ్ వాహనాల ధరలు తగ్గి వినియోగదారులకు ఊరట కలిగే అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement