
Car insurance: బీమా లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానా.. కేంద్రం కొత్త చట్టానికి సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
చాలామంది వాహనదారులు తమ వాహనాలకు బీమా లేకుండా రోడ్లపైకి వస్తున్నారు. బీమా పాలసీ గడువు ముగిసిన తర్వాత కూడా కారు, బైక్‌లను నడిపే వాళ్ల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ ధోరణి ప్రమాదానికి దారితీయవచ్చని తెలుసైనా, పలువురు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టంలో మార్పులు చేయాలని భావిస్తోంది. కొత్త నియమాల తర్వాత బీమా లేని వాహనాన్ని నడిపితే భారీ జరిమానాలు తప్పవు. ఆంగ్ల మీడియాలో వచ్చిన వివరాల ప్రకారం.. రోడ్డు భద్రతను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ మోటారు వాహనాల చట్టంలో కీలకమైన మార్పులు చేయనుంది. బీమా లేని వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం రెడీ అవుతోంది.
Details
బీమా లేకుండా వాహనం నడిపితే ఏం జరుగుతుంది?
ప్రస్తుతం బీమా లేని వాహనాన్ని తొలిసారి నడిపితే రూ. 2,000, మళ్లీ దొరికితే రూ. 4,000 జరిమానా విధిస్తున్నారు. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. మొదటిసారి బీమా లేకుండా వాహనం నడిపితే, జరిమానా ఆ వాహనం బేస్ బీమా ప్రీమియం కన్నా మూడింతలు ఉంటుంది. అదే తప్పు మళ్లీ చేస్తే, జరిమానా ప్రీమియం కన్నా ఐదింతలు అవుతుంది. దీని వల్ల ప్రజలు బీమా చేయించుకోకుండా రోడ్లపైకి రావడం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Details
డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి మార్పులు
వాహన బీమాకు సంబంధించి మాత్రమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్‌పై కూడా కొన్ని కొత్త నిబంధనలు రావొచ్చని తెలుస్తోంది. అతివేగంగా, మద్యం తాగి వాహనం నడిపినట్లు బయటపడితే, వారి లైసెన్స్ రద్దు చేసిన తర్వాత మళ్లీ పునరుద్ధరించుకోవాలంటే తిరిగి డ్రైవింగ్ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అలాగే 55 ఏళ్లు పైబడిన వారు తమ లైసెన్స్‌ను రీన్‌యూ చేయాలంటే కూడా డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.
Details
చట్ట సవరణలు అమల్లోకి ఎప్పుడంటే?
ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనను కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఇతర సంబంధిత శాఖలకు పంపించింది. వారి అభిప్రాయాల తర్వాత ఈ ప్రతిపాదన కేబినెట్‌కు పంపబడుతుంది. ఆమోదం లభించిన తర్వాత కొత్త నిబంధనలు దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి. ఈ విధంగా, రోడ్లపై ప్రయాణించే వారిలో బీమా, భద్రత పట్ల అవగాహన పెంపొందించడానికి ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.