Ola Electric Q3 results: ఓలా ఎలక్ట్రిక్‌కి భారీ నష్టం.. పోటీ, సేవా సమస్యలతో కుదేలైన ఆదాయం
ఈ వార్తాకథనం ఏంటి
ఓలా ఎలక్ట్రిక్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీకి రూ.564 కోట్ల నికర నష్టం వచ్చినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
గతేడాది ఇదే కాలంలో నమోదైన రూ.376 కోట్ల నష్టంతో పోలిస్తే, ఈసారి నష్టాలు మరింత పెరిగాయి.
పెరిగిన పోటీ కారణంగా ఆదాయాల్లో తగ్గుదల చోటు చేసుకోవడం, అలాగే సేవా లోపాలను సరిచేయడానికి భారీగా ఖర్చు చేయడం ఈ నష్టాలకు కారణంగా పేర్కొంది.
సమీక్షా త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం రూ.1296 కోట్ల నుంచి రూ.1045 కోట్లకు తగ్గిందని కంపెనీ తెలిపింది. అదే సమయంలో ఖర్చులు రూ.1505 కోట్ల నుంచి రూ.1597 కోట్లకు పెరిగాయి.
Details
వారెంటీ ఖర్చుల కోసం రూ.110 కోట్లు వెచ్చించిన సంస్థ
పండగ సీజన్ కారణంగా అక్టోబర్‌లో మంచి అమ్మకాలు నమోదైనా ఈవీ మార్కెట్‌లో పెరిగిన పోటీ, సర్వీసు సమస్యల పరిష్కారం, నెట్‌వర్క్ విస్తరణ వంటి అంశాలు మార్కెట్ వాటా, మార్జిన్లపై ప్రభావం చూపించాయని షేర్‌హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొంది.
కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారం, వారెంటీ ఖర్చుల కోసం రూ.110 కోట్లు వెచ్చించినట్లు కంపెనీ తెలిపింది.
టెక్నాలజీ ఆధునికీకరణ, జనరేషన్ 3 వాహనాల విడుదల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఖర్చులు తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
అలాగే ఉద్యోగుల హేతుబద్ధీకరణ కింద వన్‌టైమ్ పేమెంట్‌గా రూ.13 కోట్లు ఖర్చయినా మొత్తం ఉద్యోగ వ్యయం దాదాపు 17 శాతం తగ్గిందని పేర్కొంది.
నెట్‌వర్క్ విస్తరణ కోసం మరింత పెట్టుబడి పెట్టనున్నట్లు కూడా తెలియజేసింది.