Page Loader
Royal Enfield Hunter 350 Vs Honda CB350: హంటర్ 350 వర్సెస్ సీబీ350.. బెస్ట్ ఆప్షన్‌గా ఏది ఎంచుకోవాలంటే?
హంటర్ 350 వర్సెస్ సీబీ350.. బెస్ట్ ఆప్షన్‌గా ఏది ఎంచుకోవాలంటే?

Royal Enfield Hunter 350 Vs Honda CB350: హంటర్ 350 వర్సెస్ సీబీ350.. బెస్ట్ ఆప్షన్‌గా ఏది ఎంచుకోవాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 14, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్ మార్కెట్లో 350 సీసీ సెగ్మెంట్‌ బైక్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ముఖ్యంగా యువత ఈ శ్రేణిలోని బైక్స్‌తే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. దీనిని గమనించిన ప్రముఖ కంపెనీలు ఈ విభాగంలో స్టైలిష్ డిజైన్‌తో కూడిన పవర్‌ఫుల్ మోటార్‌సైకిళ్లను విపణిలోకి తీసుకువస్తున్నాయి. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, హోండా సీబీ350 లాంటి మోడళ్లకు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. అయితే మీరు కొత్తగా బైక్ కొనాలనుకుంటే, ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఎంపిక అవుతుంది? వాటి ధరలు, స్పెసిఫికేషన్లను ఒకసారి పరిశీలిద్దాం.

Details

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 వర్సెస్ హోండా సీబీ350 - ధరల్లో తేడా 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ ధర రూ.1.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమై, మోడల్‌కు అనుగుణంగా రూ.1.82 లక్షల వరకు ఉంటుంది. ఇక హోండా సీబీ350 విషయానికి వస్తే, ఇది రెండు వేరియంట్లలో లభిస్తుంది. దీని ధర రూ.2 లక్షల నుంచి ప్రారంభమై రూ.2.18 లక్షల వరకు ఉంటుంది (ఎక్స్-షోరూమ్). ఈ క్రమంలో చూస్తే, హంటర్ 350 టాప్ మోడల్ ధర కూడా సీబీ350 బేస్ మోడల్ కంటే తక్కువే కావడం గమనార్హం.

Details

ఇంజిన్, పనితీరు - ఎవరికి పైచేయి? 

2025 రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 బైక్ 349 సీసీ సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 19.72 bhp పవర్, 27 Nm టార్క్‌ను విడుదల చేస్తుంది. బైక్‌లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఈ రెట్రో స్టైల్ బైక్‌ 6 రంగుల్లో అందుబాటులో ఉంది. ఇటీవల దీనిలో కొన్ని కాస్మెటిక్, మెకానికల్ అప్‌డేట్స్ కూడా వచ్చాయి. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ (ఎంచుకున్న వేరియంట్లలో మాత్రమే), యూఎస్బీ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటివి ఇందులో చూడొచ్చు. ఈ మార్పుల వల్ల బైక్ మరింత ఆధునికత, సౌకర్యాన్ని అందిస్తోంది.

Details

సిలిండర్ ఇంజిన్ తో హోండా సీబీ 350

హోండా సీబీ350 విషయానికొస్తే, ఇది 348.36 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ బైక్ గరిష్టంగా 20.78 bhp పవర్, 29.5 Nm టార్క్‌ను అందిస్తుంది. పనితీరు పరంగా చూస్తే, హోండా సీబీ350 బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కంటే కాస్త మెరుగైన పవర్, టార్క్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. దీని వల్ల రైడింగ్‌లో మరింత సాఫ్ట్నెస్‌, స్టబిలిటీ అనుభూతి కలగొచ్చు. సారాంశంగా చెప్పాలంటే బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మంచి ఎంపిక. అయితే మరింత పవర్, టార్క్, క్లాసికల్ అప్‌మార్కెట్ ఫీల్ కోరేవారికి హోండా సీబీ350 సరైన ఎంపిక అవుతుంది.