Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా EV గ్లోబల్ డెబ్యూ కి ముహూర్తం ఫిక్స్..
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల పట్ల ప్రజల ఆసక్తి, ఆదరణ రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశీయ ఆటో మొబైల్ కంపెనీలు అయిన టాటా, మహీంద్రా ఇప్పటికే ఈవీ విభాగంలో కొత్త మోడళ్లను విడుదల చేశాయి. అంతేకాకుండా, విదేశీ కార్ మేకర్లు కూడా ఇదే దిశగా ఆలోచిస్తున్నాయి. ప్రస్తుతం, టాటా దేశంలో అగ్రగామి ఈవీ బ్రాండ్‌గా నిలుస్తోంది. టాటా ఈవీ విభాగంలో టియాగో, టిగోర్, పంచ్, నెక్సాన్, కర్వ్ వంటి మోడళ్లను అందిస్తున్నది. ఈ కార్లతో టాటా అనేక కీలకమైన మార్గాలను పరిశీలిస్తుంది. తాజాగా, మహీంద్రా BE 6e, XEV 9e వంటి కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది, ఇవి ఆధునిక ఫీచర్లతో, ఆకర్షణీయమైన డిజైన్‌తో కారు ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో లాంచ్
కాగా, హ్యుందాయ్ తమ ప్రసిద్ధ క్రెటా మోడల్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌గా మార్కెట్లో ప్రవేశపెట్టబోతున్నది. క్రెటా EV 2025 జనవరి 17 నుంచి 22 వరకు జరుగనున్న భారత మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో లాంచ్ కానుంది. ఈ సందర్భంగా క్రెటా EV మహీంద్రా BE 6e, టాటా Curvv EV, MG ZS EV, మరియు మారుతి సుజుకి e విటారా వంటి ఇతర ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడుతుంది. ఈ లాంచ్ ద్వారా హ్యుందాయ్ వారి మూడో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకొస్తుంది, ముందుగా కోనా ఎలక్ట్రిక్, ఐయోనిక్ 5 కార్లను విడుదల చేసినట్టు తెలిసిందే.
శ్రీపెరంబుదూర్ ఫ్యాక్టరీలో క్రెటా EV ఉత్పత్తి
క్రెటా EVను తమిళనాడులోని శ్రీపెరంబుదూర్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి చేయబడుతుంది. ఈ విషయాన్ని హ్యుందాయ్ చీఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫీసర్ గోపాలకృష్ణన్ సిఎస్ వెల్లడించారు. క్రెటా EV, సాధారణ క్రెటా మోడల్‌లో ఉండే డిజైన్‌ను కలిగి ఉంటుంది, కానీ ముందు గ్రిల్ ను కొత్తగా డిజైన్ చేయడం, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ వంటి మార్పులు చేయవచ్చు. అంతేకాకుండా, కార్ ఇంటీరియర్లో 10.25-అంగుళాల డ్యుయల్ డిస్ప్లే, కొత్త మూడు-స్పోక్ స్టీరింగ్ వీల్, 360 డిగ్రీ కెమెరా, ఎడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, వెంటిలేటెడ్ సీట్లు వంటి అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి.
ఒకసారి ఛార్జ్'తో 450 నుండి 500 కిలోమీటర్ల రేంజ్
క్రెటా EV స్పెసిఫికేషన్‌లు ఇంకా అధికారికంగా ప్రకటించబడకపోయినప్పటికీ, దీని 50kWh LFP బ్యాటరీతో రాబోయే అవకాశముంది. ఇది ఒకసారి ఛార్జ్ చేసినప్పుడు 450 నుండి 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించవచ్చని అంచనా. ధర రూ. 18 లక్షల (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభం అవుతుందని ఆశిస్తున్నారు.