భారతీయ వాహన మార్కెట్లోకి హ్యుందాయ్ ఎక్స్‌టర్.. రూ.6 లక్షలకే కారు
ఈ వార్తాకథనం ఏంటి
భారతీయ మార్కెట్లోకి హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటిడ్ కంపెనీ కొత్త మైక్రో ఎస్‌యూవీని ప్రవేశపెట్టింది.
హ్యుందాయ్ ఆటో సంస్థ విక్రయించే ఎస్‌యూవీ విభాగంలో అత్యంత చౌక కారుగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ గుర్తింపు సాధించింది. ఇందులో సన్‌రూఫ్ లాంచి ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి.
ఈ మేరకు బేస్ మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.5,99,900గా కంపెనీ వెల్లడించింది. మరోవైపు టాప్ వేరియంట్ ధర రూ.9,31,990గా నిర్ణయించింది.
సదరు కారు టాటా పంచ్, సిట్రాన్ సీ3, రెనో కిగెర్, నిస్సాన్ మాగ్నెట్‌తో పోటీపడుతున్నట్లు ఆటోమోబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
గ్రాండ్ ఐ10 నియోస్‌ను నిర్మించిన కె1 ప్లాట్‌ఫామ్ మీదే ఎక్స్‌టర్ కారును డిజైన్ చేశారు. ఇది ఈఎక్స్, ఎస్, ఎస్‌ఎక్స్, ఎస్‌ఎక్స్(ఓ), ఎస్‌ఎక్స్(ఓ) వేరియంట్లలో అందుబాటులో ఉంటుందన్నారు.
DETAILS
ఇప్పటికే 11000 వేల బుకింగ్స్ వచ్చాయి : హ్యుందాయ్
ఇప్పటికే హ్యుందాయ్ ఎక్స్‌టర్ కారుకు సుమారు 11 వేల బుకింగ్స్ వచ్చాయని సంస్థ ప్రకటించింది. వీటిల్లో 38 శాతం మేర ఆటో వేరియంట్‌కు, 20 శాతం సీఎన్‌జీ వేరియంట్‌కు లభించిందన్నారు.
ఎక్స్‌టర్ కారులో 1.2 లీటర్ ఎన్‌ఏ ఇంజిన్ పొందుపర్చారు. ఇది 83 బీహెచ్‌పీ, 114ఎన్‌ఎం టార్క్ ని విడుదల చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ఇందులో 5 స్పీడ్ మాన్యూవల్, 5 స్పీడ్ ఆటో గేర్ బాక్స్ వర్షన్లలో లభిస్తుందని పేర్కొంది.
మరోవైపు సీఎన్‌జీ ఇంజిన్ 69 బీహెచ్‌పీ, 95.2 ఎన్‌ఎం టార్క్‌ను విడుదల చేస్తుందని వివరించింది. ఏఎంటీ గేర్‌బాక్స్‌కు పెడల్ షిఫ్టర్లను సైతం తీసుకొచ్చినట్లు తెలిపింది.
పెట్రోల్ ఇంజిన్ మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ మైలేజీ లీటర్‌కు 19.4 కిమీగా సంస్థ చెబుతోంది.
DETAILS
అత్యధికంగా సీఎన్‌జీ వేరియంట్ 27.1 కిమీ మైలేజీ ఇస్తోంది : కంపెనీ
ఆటో వేరియంట్ 19.2గా, సీఎన్‌జీ వేరియంట్ కిలోకి అత్యధికంగా 27.1 కిమీ మైలేజీ ఇస్తుందని స్పష్టం చేసింది.
పగటి పూట రన్నింగ్ లాంప్స్, వెనుకవైపు హెచ్ ఆకారంలోని ఎల్‌ఈడీ ల్యాంప్స్, 15 అంగుళాల అలాయ్ వీల్స్ లాంటి హంగులతో వాహనాన్ని తీర్చిదిద్దారు.
ఎక్స్‌టర్ కారును 3 డ్యూయల్ టోన్ కలర్స్‌లో అందుబాటులోకి తెచ్చారు. 3,815 ఎంఎం పొడవుతో 1,710 ఎంఎం వెడల్పుతో 1,631 ఎంఎం ఎత్తులో దీన్ని నిర్మించారు.
2,450 ఎంఎం వీల్ బేస్ తో 185 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉండేలా రూపొందించారు. 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఏబీఎస్, ఈబీడీ, రియర్ సెన్సర్ సహా అన్ని సీట్లకూ సీట్ బెల్ట్ రిమైండర్ అన్ని వేరియంట్లలో పొందుపర్చారు.