Hyundai: హ్యుందాయ్ పాలిసేడ్‌లో కొత్త వేరియంట్.. రోల్స్ రాయిస్‌ను మించిన లగ్జరీ ఫీచర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
రోల్స్ రాయిస్ కార్‌లను తలపించే ఫీచర్‌తో హ్యుందాయ్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ పాలిసేడ్‌లో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. దక్షిణ కొరియాలో 2027 మోడల్ ఇయర్ పాలిసేడ్‌ను సంస్థ విడుదల చేసింది. ఇందులో పలు అప్‌డేట్స్‌తో పాటు కొత్త హై రూఫ్ వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. పాలిసేడ్ లైనప్‌లో అత్యంత లగ్జరీ వెర్షన్‌గా ఉన్న ఈ వేరియంట్ ధర KRW 72,440,000 (సుమారు 52,300 డాలర్లు) నుంచి ప్రారంభమవుతుంది. హై రూఫ్ వేరియంట్‌లో అదనపు హెడ్‌రూమ్ కోసం పైకప్పు ఎత్తును పెంచారు. అయితే అండర్‌గ్రౌండ్ పార్కింగ్ వంటి సదుపాయాల్లో ఉన్న ఎత్తు పరిమితులకు అనుగుణంగానే దీన్ని రూపొందించారు. సాధారణ పాలిసేడ్‌తో పోలిస్తే ఈ వేరియంట్‌లో 240 మిల్లీమీటర్ల అదనపు హెడ్‌రూమ్ లభిస్తుంది.
వివరాలు
ప్రయాణికులకు మరింత ప్రీమియం..
ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే.. బాడీ కలర్‌లోనే పొడిగించిన రూఫ్‌ను అందించారు.
దీనికి మెటాలిక్ హైలైట్స్, బ్లాక్ విండో సరౌండ్స్, 21 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.
ఇంటీరియర్‌లో పాప్-అవుట్ LED రీడింగ్ లైట్లు, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, ఏసీ వెంట్స్ ఉన్నాయి.
ముఖ్యంగా రూఫ్‌పై నక్షత్రాల మాదిరిగా కనిపించే లైటింగ్ ప్యాటర్న్‌ను ఇచ్చారు.
ఇది రోల్స్ రాయిస్ మోడళ్లలో కనిపించే స్టార్‌లైట్ రూఫ్‌ను తలపించేలా ఉండటం విశేషం.
వెనుక సీట్లలో ప్రయాణించే వారికి వినోదాన్ని అందించేందుకు 21.4 అంగుళాల స్క్రీన్‌ను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు.
దీంతో వెనుక సీటు ప్రయాణికులకు మరింత ప్రీమియం అనుభూతి లభిస్తుంది.
వివరాలు
కొన్ని వేరియంట్లలో ప్రివ్యూ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ సస్పెన్షన్..
ఇక VIP Package 2 ఆప్షన్‌ను ఎంచుకుంటే రెండో వరుస ప్రయాణికుల కోసం ప్రీమియం ఫ్లోర్ మ్యాట్స్, మల్టీ-ఫంక్షన్ కన్సోల్ లభిస్తాయి.
ఇందులో ఎయిర్ ప్యూరిఫైయర్, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్‌తో పాటు వేడి, చల్లని పానీయాలను ఉంచుకునేందుకు హీటెడ్, కూల్డ్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి.
ఇవన్నీ ఎస్‌యూవీలో లగ్జరీ అనుభూతిని మరింత పెంచేలా రూపొందించారు.
కొలతల విషయానికి వస్తే.. పాలిసేడ్ పొడవు 5,090 మిల్లీమీటర్లు, వెడల్పు 1,980 మిల్లీమీటర్లుగా ఉంది.
హై రూఫ్ వేరియంట్‌లో ఎత్తు 2,005 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. వీల్‌బేస్ 2,970 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది.
కొన్ని వేరియంట్లలో ప్రివ్యూ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ సస్పెన్షన్‌ను కూడా అందిస్తున్నారు.
వివరాలు
ఇంజిన్ పనితీరు ఎలా ఉందంటే..
ముందు కెమెరా, నావిగేషన్ డేటాను ఉపయోగించి ఈ సిస్టమ్ సస్పెన్షన్ పనితీరును ఆటోమేటిక్‌గా మారుస్తుంది.
రోడ్డుపై పరిస్థితులకు అనుగుణంగా రియల్‌టైమ్‌లో సస్పెన్షన్‌ను సర్దుబాటు చేయడం ద్వారా ప్రయాణంలో మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.
2027 హ్యుందాయ్ పాలిసేడ్ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.
ఇందులో 2.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 281 హెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరో ఆప్షన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్.
ఇది మొత్తం 334 హెచ్‌పీ పవర్‌ను అందిస్తుంది. ఈ రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లతోనూ ఫ్రంట్-వీల్ డ్రైవ్ (FWD), ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
దీంతో తమ అవసరాలు, డ్రైవింగ్ పరిస్థితులకు అనుగుణంగా కస్టమర్లు ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది.