LOADING...
EV Growth: ఇంట్లో చార్జింగ్ లేక భారత్‌లో ఈవీ వృద్ధి మందగింపు: నివేదిక
ఇంట్లో చార్జింగ్ లేక భారత్‌లో ఈవీ వృద్ధి మందగింపు: నివేదిక

EV Growth: ఇంట్లో చార్జింగ్ లేక భారత్‌లో ఈవీ వృద్ధి మందగింపు: నివేదిక

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 30, 2026
05:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, గృహ చార్జింగ్ సౌకర్యాల కొరత కారణంగా ఈ రంగం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని కొత్త అధ్యయనం వెల్లడించింది. అలయన్స్ ఫర్ అన్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ (AEEE)-కాజమ్ సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక ప్రకారం, దేశంలోని చాలా ఇళ్లలో సురక్షితమైన, నమ్మకమైన, అందుబాటు ధరలో ఉండే ఈవీ చార్జింగ్ సదుపాయాలు ఇంకా పూర్తిగా సిద్ధంగా లేవు. దీంతో ఈవీల వినియోగం పెరగడంలో ప్రధాన అడ్డంకి ఏర్పడుతోందని పేర్కొంది. నివేదిక ప్రకారం, ఈవీ కొనుగోలు చేయడం ఒక్కటే సరిపోదు. ఇంట్లో రాత్రి సమయంలో సురక్షితంగా వాహనాన్ని చార్జ్ చేసుకునే సదుపాయం ఉండాలి.

వివరాలు 

2025 నాటికి 23 లక్షలకు పైగా అమ్ముడైన ఈవీలు

అయితే అనేక ఇళ్లలో బలహీనమైన వైరింగ్, ఓవర్‌లోడ్ అయ్యే ప్లగ్ పాయింట్లు, అదనపు విద్యుత్ పనుల అవసరం వంటి సమస్యలు కొనుగోలుదారులను వెనక్కి తగ్గిస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు ఇది కీలక అంశంగా మారిందని అధ్యయనం తెలిపింది. భారత్‌లో 2016లో కేవలం 50 వేల ఈవీలు మాత్రమే అమ్ముడవగా, 2025 నాటికి ఈ సంఖ్య 23 లక్షలకు పైగా చేరింది. మొత్తం అమ్మకాలలో దాదాపు 91 శాతం రెండు చక్రాల, మూడు చక్రాల ఎలక్ట్రిక్ వాహనాలే ఉండటం గమనార్హం. ఇవి రోజువారీ ప్రయాణాలు, ఉపాధితో నేరుగా అనుసంధానమై ఉన్నప్పటికీ, గృహ చార్జింగ్ వ్యవస్థలు అదే వేగంతో అభివృద్ధి చెందలేదని నివేదిక పేర్కొంది.

వివరాలు 

ఈవీ కొనుగోలు చేసిన 55 శాతం మందికే ఇంట్లో చార్జింగ్ సౌకర్యం

ప్రస్తుతం ఈవీ కొనుగోలు చేయాలనుకునే వారిలో కేవలం 55 శాతం మందికే ఇంట్లో చార్జింగ్ సౌకర్యం అందుబాటులో ఉందని అధ్యయనం వెల్లడించింది. మరో 30 శాతం మంది విద్యుత్ వ్యవస్థలో మార్పులు చేసిన తర్వాతే చార్జింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపింది. దీంతో చాలామంది తాత్కాలిక విద్యుత్ కనెక్షన్లు, సాధారణ ప్లగ్ పాయింట్లు, ఎక్స్‌టెన్షన్ వైర్లు వంటి సురక్షితం కాని మార్గాలను ఉపయోగించాల్సి వస్తోందని పేర్కొంది. ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లు అగ్ని ప్రమాదాలు, విద్యుత్ షాక్‌లు, చార్జింగ్ అంతరాయాలు, చార్జర్ పరికరాల నష్టం, బ్యాటరీ పనితీరు తగ్గడం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.

Advertisement

వివరాలు 

చార్జర్ ఖర్చు వాహనం ధరలోనే..

అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, అద్దె ఇళ్లలో నివసించే వారికి ఈ సమస్య మరింత తీవ్రమైందని అధ్యయనం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో సుమారు 70 నుంచి 75 శాతం కుటుంబాలు అపార్ట్‌మెంట్లు లేదా బహుళ కుటుంబ నివాసాల్లో ఉంటున్నాయి. ముంబై, బెంగళూరు వంటి మహానగరాల్లో 60 నుంచి 80 శాతం మంది ఉమ్మడి పార్కింగ్ సదుపాయాలు ఉన్న అపార్ట్‌మెంట్లలో నివసిస్తున్నారు. ఇక్కడ పార్కింగ్, విద్యుత్ కనెక్షన్లు, మీటరింగ్‌పై వ్యక్తిగత నియంత్రణ లేకపోవడం వల్ల గృహ చార్జింగ్ ఏర్పాటు చేయడం కష్టంగా మారుతోంది. కాజమ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అక్షయ్ శేఖర్ మాట్లాడుతూ, చార్జర్ ధర పెద్ద సమస్య కాదన్నారు. చాలా సందర్భాల్లో చార్జర్ ఖర్చు వాహనం ధరలోనే ఉంటుందని తెలిపారు.

Advertisement

వివరాలు 

గిగ్ వర్కర్లు, డెలివరీ సిబ్బందిపై ఈ సమస్య మరింత ప్రభావం

అయితే అపార్ట్‌మెంట్ యాజమాన్యాలు, నివాస సంఘాలు, విద్యుత్ శాఖలు కలిసి వేగంగా అనుమతులు ఇవ్వడం ప్రధాన సవాలుగా మారిందన్నారు. అద్దె ఇళ్లు, అపార్ట్‌మెంట్లలో నివసించే వారు ఈవీలు కొనడానికి ఆసక్తి చూపుతున్నప్పటికీ, భవనంలో చార్జింగ్ ఏర్పాటు చేయడానికి యజమానులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, విద్యుత్ సంస్థల అనుమతులు అవసరం అవుతున్నాయని నివేదిక పేర్కొంది. దీంతో ఒక సాధారణ రాత్రి చార్జింగ్ సదుపాయం కూడా సుదీర్ఘ ప్రక్రియగా మారుతోందని తెలిపింది. గిగ్ వర్కర్లు, డెలివరీ సిబ్బందిపై ఈ సమస్య మరింత ప్రభావం చూపుతోందని అధ్యయనం వెల్లడించింది. వీరు వారానికి సుమారు 250 నుంచి 300 కిలోమీటర్లు ప్రయాణిస్తుంటారు. అందువల్ల ప్రతి రాత్రి నమ్మకమైన చార్జింగ్ సౌకర్యం వారి ఆదాయానికి కీలకంగా మారుతోంది.

వివరాలు 

భవనాల లోపలి విద్యుత్ వ్యవస్థల్లోనే అసలు సమస్య

చార్జింగ్ ఆలస్యం కావడం లేదా ఖరీదైన ప్రత్యామ్నాయాలను ఆశ్రయించాల్సి రావడం వల్ల పని గంటలు తగ్గి ఆదాయంపై ప్రభావం పడుతోందని నివేదిక తెలిపింది. ఏఈఈఈ ప్రతినిధి సుమేధ్ అగర్వాల్ మాట్లాడుతూ,అసలు సమస్య వాహనాలు లేదా చార్జర్లలో కాదని, భవనాల లోపలి విద్యుత్ వ్యవస్థల్లోనే ఉందన్నారు. గృహ విద్యుత్ వ్యవస్థలను ఆధునీకరించడం, భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా మాత్రమే ఈవీల వినియోగం వేగంగా పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. దేశంలోని దాదాపు 45 శాతం ఇళ్లలో ఈవీలను సురక్షితంగా చార్జ్ చేయాలంటే విద్యుత్ వ్యవస్థలో మార్పులు అవసరమని నివేదిక స్పష్టం చేసింది.

వివరాలు 

దేశవ్యాప్తంగా ఇళ్లు,అపార్ట్‌మెంట్లు, పార్కింగ్ ప్రాంతాలు కూడా ఈవీలకు అనుకూలంగా ఉండడం అవసరం 

ఈవీలకు అనుకూలంగా ఇళ్లను సిద్ధం చేసే జాతీయ విధానం, ప్రత్యేక ఈవీ మీటరింగ్, సురక్షిత చార్జింగ్ ప్రమాణాలు, గృహ నిర్మాణ సంస్థలు, విద్యుత్ శాఖలు, విధాన నిర్ణేతల మధ్య సమన్వయం పెంచాలని సూచించింది. భారత్‌లో ఈవీ మార్కెట్ తదుపరి దశలో వేగంగా అభివృద్ధి చెందాలంటే షోరూమ్‌లలో వాహనాల విక్రయాలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, పార్కింగ్ ప్రాంతాలు కూడా ఈవీలకు అనుకూలంగా సిద్ధంగా ఉండటం అత్యంత అవసరమని నివేదిక స్పష్టం చేసింది.

Advertisement