Kia Seltos SUV: కొత్త హంగులతో కియా సెల్టోస్ లాంచ్.. ప్రారంభ ధర రూ.10.99 లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆటో మొబైల్ రంగంలో భారీ అంచనాల మధ్య నెక్స్ట్-జనరేషన్ కియా సెల్టోస్ ఎస్‌యూవీ అధికారికంగా మార్కెట్లోకి వచ్చింది. కియా ఇండియా ఈ మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 10.99 లక్షలుగా ప్రకటించింది. ఇది సాధారణ ఫేస్‌లిఫ్ట్ మాత్రమే కాదు. డిజైన్, పరిమాణం, టెక్నాలజీ, భద్రత పరంగా పూర్తిగా కొత్త తరం వాహనంగా సెల్టోస్‌ను కంపెనీ రూపొందించింది. ఈ ఎస్‌యూవీని ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో తయారు చేయడం మరో ప్రత్యేకత.
Details
కొత్త ప్లాట్‌ఫామ్, పెరిగిన కొలతలు
కొత్త కియా సెల్టోస్‌ను గ్లోబల్ K3 ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను భారత మార్కెట్లో వినియోగించడం ఇదే తొలిసారి. గత మోడల్‌తో పోలిస్తే కొత్త సెల్టోస్ పొడవు 95 మిల్లీమీటర్లు, వెడల్పు 30 మిల్లీమీటర్లు, వీల్‌బేస్ 80 మిల్లీమీటర్లు పెరిగింది. దీనివల్ల క్యాబిన్‌లో ప్రయాణికులకు మరింత విశాలత, కంఫర్ట్ లభించనుంది. డిజైన్ పరంగా కియా 'ఆపోజిట్స్ యునైటెడ్' ఫిలాసఫీని అనుసరించింది. ముందు భాగంలో డిజిటల్ టైగర్ ఫేస్, ఐస్ క్యూబ్ LED హెడ్‌ల్యాంప్స్, స్టార్ మ్యాప్ LED DRLలు ఆధునిక లుక్‌ను ఇస్తున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్, కొత్త 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Details
ఆధునిక ఇంటీరియర్, ఇంజిన్ ఎంపికలు
ఇంటీరియర్‌లోకి వస్తే, కొత్త సెల్టోస్‌లో 30-అంగుళాల ట్రినిటీ పనోరమిక్ డిస్‌ప్లే ప్యానెల్ ప్రధాన హైలైట్. ఇందులో 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ సమ్మిళితంగా ఉంటాయి. డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 10-వే పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇంజిన్ ఆప్షన్లలో మూడు వేరియంట్లు ఉన్నాయి. 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (115 హెచ్‌పీ), 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (160 హెచ్‌పీ), 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ (116 హెచ్‌పీ)లను కస్టమర్లు ఎంచుకోవచ్చు.
Details
భద్రత, ధరల వివరాలు
గేర్‌బాక్స్ ఎంపికల్లో 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ iMT, CVT, 7-స్పీడ్ DCT, 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ఆప్షన్లు ఉన్నాయి. సేఫ్టీ విషయంలో కియా ప్రత్యేక దృష్టి పెట్టింది. అన్ని వేరియంట్లలోనూ 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. టాప్ వేరియంట్లలో 21 ఫంక్షన్లతో కూడిన లెవెల్-2 ADAS టెక్నాలజీని అమర్చారు. ఈ సందర్భంగా కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్‌గు లీ మాట్లాడుతూ, "ఆధునిక భారతీయ కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్‌కు సిద్ధంగా ఉండే ఎస్‌యూవీలను అందించాలన్న మా నిబద్ధతకు కొత్త సెల్టోస్ నిదర్శనం. స్పేస్, సేఫ్టీ, టెక్నాలజీ అంశాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పడమే మా లక్ష్యం" అని తెలిపారు.
Details
2026 జనవరి మధ్య నుంచి డెలివరీలు
కొత్త సెల్టోస్ HTE, HTK, HTX, GTX అనే నాలుగు ప్రధాన ట్రిమ్‌లతో పాటు టాప్-స్పెక్ X-లైన్ ట్రిమ్‌లో కూడా లభిస్తుంది. దీని ధరలు రూ. 10.99 లక్షల నుంచి ప్రారంభమై, టాప్ ఎండ్ టర్బో పెట్రోల్, డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్లకు రూ. 19.99 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. గతేడాది డిసెంబర్ 11 నుంచి రూ. 25,000తో బుకింగ్‌లు ప్రారంభం కాగా, 2026 జనవరి మధ్య నుంచి డెలివరీలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.