
MSIL: మారుతి కార్లకు జూలైలో హై స్పీడ్ అమ్మకాలు.. ఎన్ని అమ్మకాలు జరిగాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మిడిల్ క్లాస్ వినియోగదారుల్లో విశేషంగా ఆదరణ పొందే కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (MSIL) 2025 జూలై నెల అమ్మకాల గణాంకాలను విడుదల చేసింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, జూలైలో మొత్తం 1,80,526 వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ మార్కెట్‌కు సరఫరా చేసిన వాహనాలతో పాటు ఎగుమతుల గణాంకాలు కూడా ఉన్నాయి. గతేడాది జూలైలో 1,75,041 వాహనాలు విక్రయించగా, ఈ ఏడాది 3 శాతం వృద్ధితో 1,80,526 యూనిట్లకు చేరుకుంది. దేశీయంగా డీలర్లకు పంపిన ప్యాసింజర్ వాహనాల సంఖ్య 1,37,776గా ఉంది. గతేడాది ఇదే నెలలో ఈ గణాంకం 1,37,463గా నమోదైంది.
Details
మినీ కార్ల విభాగంలో ఎదురుదెబ్బ
ఎగుమతుల పరంగా చూస్తే గత ఏడాది జూలైలో 23,985 యూనిట్లు ఎగుమతి చేయగా, 2025 జూలైలో ఈ సంఖ్య 31,745 యూనిట్లకు పెరిగింది. అయితే, మినీ కార్ల విభాగంలో మాత్రం కంపెనీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడళ్లను కలిపి మొత్తం 6,822 యూనిట్లు విక్రయించగా, 2024 జూలైలో ఈ సంఖ్య 9,960 యూనిట్లుగా ఉంది. అంటే 3,138 యూనిట్ల తగ్గుదల జరిగింది. ఇదిలా ఉండగా, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, కాంపాక్ట్ కార్ల విభాగంలో కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది. బాలెనో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్ వంటి మోడళ్లను కలిపి 2024 జూలైలో 58,682 యూనిట్లు విక్రయించగా, 2025 జూలైలో ఈ గణాంకం 65,667 యూనిట్లకు చేరింది.
Details
ఎస్‌యూవీ విభాగంలో క్షీణత
ఇది ఏకంగా 6,985 యూనిట్ల వృద్ధిని సూచిస్తోంది. మరోవైపు ఎస్‌యూవీ విభాగంలో మాత్రం మారుతికి ఈసారి క్షీణత ఎదురైంది. గ్రాండ్ విటారా, బ్రెజ్జా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 వంటి మోడళ్లను కలిపి 2024 జూలైలో 56,302 యూనిట్లు విక్రయించగా, 2025 జూలైలో ఇది 52,773 యూనిట్లకు తగ్గిపోయింది. అంటే 3,529 యూనిట్ల తగ్గుదల నమోదైంది. వాన్ సెగ్మెంట్‌లో మాత్రం ఎకో మోడల్ ద్వారా మంచి ఫలితాలను సాధించింది. 2024 జూలైలో 11,916 యూనిట్లు విక్రయించగా, 2025 జూలైలో ఇది 12,341 యూనిట్లకు పెరిగింది. ఇది 425 యూనిట్ల వృద్ధితో 3.57 శాతం గణాంకాత్మకంగా పెరుగుదల చూపించింది. అంతకుముందు జూన్‌లో ఈ మోడల్‌కు 9,340 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.