Maruti Suzuki : మారుతి సుజుకి.. ఒక సంవత్సరంలో 20 లక్షల వార్షిక ఉత్పత్తి
భారతదేశంలో మారుతి కార్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కారు మిడిల్ క్లాస్ ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తుంది, అలాగే విదేశాలలో కూడా దీనికి మంచి డిమాండ్ ఉంది. తాజాగా, మారుతీ సుజుకీ ఒక అద్భుతమైన రికార్డు సృష్టించింది. ఒకే ఏడాదిలో 20 లక్షల కార్లను ఉత్పత్తి చేసినట్లు కంపెనీ ప్రకటించింది, ఇది కంపెనీ చరిత్రలో ఒక అద్భుతమైన ఘనత. ప్యాసింజర్ వాహనాల ఉత్పత్తిలో ఈ ఘనత సాధించిన మొదటి బ్రాండ్ మారుతి సుజుకి.
క్యాలెండర్ ఇయర్‌లో తొలిసారిగా 20 లక్షల వాహనాల విక్రయం
మంగళవారం మారుతి సుజుకి ఇండియా క్యాలెండర్ ఇయర్‌లో తొలిసారిగా 20 లక్షల వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ఈ విజయం తర్వాత మారుతి సుజుకి ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. ఈ 20 లక్షల వాహనాల్లో 60 శాతం హర్యానాలో, 40 శాతం గుజరాత్‌లో ఉత్పత్తి చేయబడ్డాయి. మారుతి సుజుకి ఇండియా సీఈఓ మరియు మేనేజింగ్ డైరెక్టర్ హిసాషి టేకుచి ఈ సందర్భంగా మాట్లాడుతూ, "2 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సంఖ్యను చేరుకోవడం భారతదేశం యొక్క తయారీ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. 'మేక్ ఇన్ ఇండియా' చొరవ పట్ల మా నిబద్ధతను కూడా ప్రతిబింబిస్తుంది," అని అన్నారు.
100 దేశాలకు 17 మోడళ్ల ఎగుమతి
ఈ విజయం సరఫరాదారులు, డీలర్ భాగస్వాములతో కలిసి దేశంలో ఆర్థిక వృద్ధిని నడిపించడానికి, భారతదేశం నిర్మాణానికి మద్దతు ఇవ్వడానికి సహాయపడుతుందని టేకుచి తెలిపారు. అంతేకాదు, భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచ స్థాయిలో పోటీ చేయగలిగేలా తీర్చిదిద్దడంపై మారుతి సుజుకి కట్టుబడి ఉందని చెప్పారు. భారతదేశం నుండి మొత్తం ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల్లో మారుతి సుజుకి వాటా 40 శాతం ఉంది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు 17 మోడళ్లను ఎగుమతి చేస్తోంది.
ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచాలనే యోచన
మారుతి సుజుకి భారత్‌లో మూడు ప్రధాన ఉత్పత్తి ప్లాంట్లను కలిగి ఉంది. ఈ ప్లాంట్లు హర్యానాలో (గురుగ్రామ్, మనేసర్) మరియు గుజరాత్‌లో (హంసల్‌పూర్) ఉన్నాయి. ఈ మూడు ప్లాంట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 23.5 లక్షల యూనిట్లుగా ఉంది. ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచాలనే యోచనలో కంపెనీ ఉంది. దీనికోసం హర్యానాలోని ఖర్ఖోడాలో గ్రీన్‌ఫీల్డ్ ఉత్పత్తి కేంద్రాన్ని కంపెనీ ఏర్పాటు చేస్తోంది. ఖర్ఖోడాలో ప్రణాళిక ప్రకారం నిర్మాణం సాగుతున్నందున, ఈ ప్లాంట్ 2025లో ప్రారంభం అవుతుంది. ఖర్ఖోడాలో ఉత్పత్తి సదుపాయాలు పూర్తిగా అందుబాటులోకి రాగానే, ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు చర్యలు తీసుకోనున్నట్లు కంపెనీ పేర్కొంది.