Loading...
Maruti Suzuki: మారుతి సుజుకి కీలక నిర్ణయం.. మహిళలకు 30% ఎన్‌రోల్‌మెంట్‌ లక్ష్యం
మారుతి సుజుకి కీలక నిర్ణయం.. మహిళలకు 30% ఎన్‌రోల్‌మెంట్‌ లక్ష్యం

Maruti Suzuki: మారుతి సుజుకి కీలక నిర్ణయం.. మహిళలకు 30% ఎన్‌రోల్‌మెంట్‌ లక్ష్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 22, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) కీలక చర్యలు చేపడుతోంది. మనేసర్‌లోని ఉంచా మజ్రాలో ఉన్న జపాన్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ (JIM) ద్వారా మరింత మంది మహిళలను సాంకేతిక శిక్షణ వైపు తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2028-29 విద్యా సంవత్సరానికి JIMలో మహిళా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌ను 30 శాతానికి పెంచాలని మారుతి సుజుకి లక్ష్యంగా నిర్దేశించింది. మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి అవసరమైన నైపుణ్యం కలిగిన మహిళా నిపుణుల సంఖ్యను పెంచేందుకు చేపడుతున్న విస్తృత కార్యక్రమంలో భాగంగా ఈ లక్ష్యాన్ని ప్రకటించింది. వర్క్‌ఫోర్స్‌లో వైవిధ్యానికి ఆటోమొబైల్ పరిశ్రమ ప్రాధాన్యం ఇస్తున్న సమయంలో.. టెక్నికల్ నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల అవసరం కూడా పెరుగుతోంది.

వివరాలు

మ్యానుఫ్యాక్చరింగ్‌లో మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహం

ఈ నేపథ్యంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై మారుతి సుజుకి దృష్టి సారించింది.

మనేసర్‌లోని ఉంచా మజ్రా JIMలో మొత్తం తొమ్మిది ట్రేడ్లలో శిక్షణ అందిస్తున్నారు. వీటిలో ఎక్కువ భాగం ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించిన ట్రేడ్లే ఉన్నాయి.

మారుతి సుజుకి ప్రకారం.. గత రెండు విద్యా సంవత్సరాల్లో ఈ సంస్థలో మహిళా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ క్రమంగా పెరుగుతోంది.

దీంతో రాబోయే సంవత్సరాల్లో మరింత మంది మహిళలను చేర్చుకునేలా లక్ష్యాన్ని పెంచింది.

ఈ కార్యక్రమంపై మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ కార్పొరేట్ అఫైర్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. సమగ్ర మ్యానుఫ్యాక్చరింగ్ వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేయడంలో వైవిధ్యం కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

వివరాలు

కెరీర్ అవకాశాలపై అవగాహన లేదు

దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన మహిళలు ఉన్నప్పటికీ.. మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉన్న కెరీర్ అవకాశాల గురించి చాలామందికి అవగాహన లేదని ఆయన పేర్కొన్నారు.

అంతేకాకుండా ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకునే విషయాన్ని కూడా చాలామంది మహిళలు పరిశీలించడం లేదని తెలిపారు.

మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడ్లలో JIMకు చెందిన ఇద్దరు మహిళా విద్యార్థినులు ఇటీవల హర్యానా రాష్ట్ర టాపర్లుగా నిలిచారని కంపెనీ వెల్లడించింది.

సాంకేతిక రంగాల్లోకి మహిళలు ప్రవేశిస్తే ఉన్న అవకాశాలను ఇది తెలియజేస్తుందని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

మహిళా విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపు

మహిళల ఎన్‌రోల్‌మెంట్‌ను మరింత పెంచేందుకు మారుతి సుజుకి కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ విద్యా సంవత్సరం నుంచి JIMలో చేరే మహిళా విద్యార్థులకు 100 శాతం ట్యూషన్ ఫీజు మినహాయింపును ప్రకటించింది.

అంతేకాకుండా మరింత సమగ్ర, మహిళలకు అనుకూలమైన విద్యా వాతావరణాన్ని కల్పించేందుకు అదనపు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా..

మహిళల కోసం ప్రత్యేక హాస్టల్ సదుపాయాలు

ఫ్యాకల్టీ, సపోర్ట్ స్టాఫ్‌లో మహిళల ప్రాతినిధ్యం పెంపు

టెక్నికల్ ట్రేడ్లలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు మెరుగైన సహాయక వ్యవస్థలు

వంటి చర్యలను అమలు చేస్తోంది.

ఈచర్యల ద్వారా యువతులకు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కెరీర్ అవకాశాలు మరింత అందుబాటులోకి రావడంతో పాటు.. ఈ రంగాన్ని ఎంచుకునేందుకు వారు ఆసక్తి చూపేలా చేయవచ్చని మారుతి సుజుకి భావిస్తోంది

ADVERTISEMENT

వివరాలు

జపాన్-ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఫర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ అంటే ఏమిటి?

జపాన్-ఇండియా ఇన్‌స్టిట్యూట్స్ ఫర్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ (JIMs) అనేవి భారత, జపాన్ ప్రభుత్వాల సహకారంతో చేపట్టిన కార్యక్రమాలు.

మ్యాన్యుఫ్యాక్చరింగ్ రంగానికి పరిశ్రమలకు అనుగుణమైన నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను తయారు చేయడం వీటి ప్రధాన లక్ష్యం.

ప్రస్తుతం మారుతి సుజుకి నాలుగు JIM సంస్థలను నిర్వహిస్తోంది. అవి..

మెహసానా, గుజరాత్

గాంధీనగర్, గుజరాత్

ఉంచా మజ్రా, మనేసర్, హర్యానా

సోనిపట్, హర్యానా

ఈ సంస్థల్లో డ్యూయల్ సిస్టమ్ ఆఫ్ ట్రైనింగ్ (DST) విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇందులో క్లాస్‌రూమ్ విద్యతో పాటు పరిశ్రమల్లో ప్రత్యక్ష అనుభవాన్ని కూడా కల్పిస్తారు.

విద్యార్థులు ప్రతి ఏడాది సుమారు ఏడు నెలల పాటు చెల్లింపు కలిగిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పొందుతారు.

వివరాలు

జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ విధానాల ఆధారంగా శిక్షణ

దీంతో కోర్సులో భాగంగానే ప్రాక్టికల్ అనుభవం సంపాదించడంతో పాటు శిక్షణ సమయంలోనే ఆదాయం పొందే అవకాశం ఉంటుంది.

JIMలలో అందించే కరిక్యులమ్‌లో అధునాతన మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్, షాప్‌-ఫ్లోర్ సామర్థ్యం, వర్క్‌ప్లేస్ డిసిప్లిన్‌కు ప్రాధాన్యం ఇస్తారు.

ఈ శిక్షణలో జపాన్ మ్యానుఫ్యాక్చరింగ్ విధానాల నుంచి స్ఫూర్తి పొందిన అంశాలను ఉపయోగిస్తున్నారు. టెక్నికల్ శిక్షణతో పాటు విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్‌ను కూడా అభివృద్ధి చేసేలా శిక్షణ ఇస్తారు. తద్వారా వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తున్నారు.

భారత ఆటోమొబైల్ పరిశ్రమ విస్తరిస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి అవసరమైన మరింత విస్తృతమైన, వైవిధ్యభరితమైన వర్క్‌ఫోర్స్‌ను తయారు చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.

ADVERTISEMENT