LOADING...
MG Windsor EV: భారత మార్కెట్‌ను ఊపేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. జూలైలో సరికొత్త అమ్మకాల రికార్డ్!
భారత మార్కెట్‌ను ఊపేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. జూలైలో సరికొత్త అమ్మకాల రికార్డ్

MG Windsor EV: భారత మార్కెట్‌ను ఊపేస్తున్న ఎంజీ విండ్సర్ ఈవీ.. జూలైలో సరికొత్త అమ్మకాల రికార్డ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఎంజీ విండ్సర్ ఈవీ తన విజయపథంలో వేగంగా ముందుకు సాగుతోంది. జూలై 2025లో ఈ కారు తన ఇప్పటివరకు ఉన్న అత్యధిక నెలవారీ అమ్మకాల రికార్డును సృష్టించింది. గత నెలలోనే 4,308 యూనిట్లు అమ్ముడవగా, మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 36,000 యూనిట్లకు పైగా విక్రయమయ్యాయి. దీంతో ఈవీ సెగ్మెంట్‌లో అగ్రస్థానం మరింత బలపరుచుకుంది. విండ్సర్ ఈవీ విక్రయాల జోరుతో, 2025 రెండో త్రైమాసికంలో ఎంజీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వాటా 32శాతానికి పెరిగింది. ఇది గత త్రైమాసికం కంటే 4శాతం ఎక్కువ. ఇదే కాలంలో విండ్సర్ అమ్మకాలు 17% పెరిగితే, మొత్తం ఎంజీ ఈవీ హోల్‌సేల్ విక్రయాలు 28శాతం వృద్ధి సాధించాయి.

Details

డిజైన్ హైలైట్స్

ఎంజీ విండ్సర్ ఈవీ డిజైన్‌లో హ్యాచ్‌బ్యాక్, ఎంపీవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీల స్టైల్స్ మేళవించారు. ముందు భాగంలో ఎల్ఈడీ డేటైమ్ రన్నింగ్ లైట్లు, ప్రొజెక్టర్ హెడ్‌లైట్లతో కూడిన స్ప్లిట్ లైటింగ్ డిజైన్, వెలిగే ఎంజీ లోగో ఆకర్షణీయంగా ఉంటాయి. పక్క భాగంలో సొగసైన లైన్లు, పెద్ద కిటికీలు, అల్లాయ్ వీల్స్, వెనుక భాగంలో కనెక్ట్‌డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్లు, రూఫ్ స్పాయిలర్, వాలుగా ఉండే వెనుక విండో డిజైన్ ప్రత్యేకత కల్పిస్తాయి.

Details

ఇంటీరియర్ & ఫీచర్లు 

లోపలి భాగంలో డార్క్ థీమ్‌తో పాటు బ్రాంజ్, వుడ్ యాక్సెంట్స్ వాడటం వల్ల క్యాబిన్ విశాలంగా అనిపిస్తుంది. పనోరమిక్ గ్లాస్ రూఫ్ ఈ విశాలత్వాన్ని మరింత పెంచుతుంది. ధర రూ. 10 లక్షల నుంచి రూ. 13.10 లక్షల వరకు (ఎక్స్‌-షోరూమ్) ఉంటుంది. అదనంగా 'బ్యాటరీ-యాస్-ఏ-సర్వీస్ (BaaS)' ఆప్షన్‌తో రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభ ధరలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ ఆప్షన్‌లో కిలోమీటర్‌కు రుసుము చెల్లించాలి. విశిష్ట ఫీచర్లలో 135 డిగ్రీల వరకు వెనక్కి వాలే 'ఏరో లాంజ్' సీట్లు, 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ (నావిగేషన్, ఇన్ఫోటైన్‌మెంట్, వాహన నియంత్రణల కోసం) ఉన్నాయి.

Details

స్పెసిఫికేషన్లు 

అన్ని వేరియంట్లలో 38 కిలోవాట్ గంటల బ్యాటరీ ప్యాక్, 134 బీహెచ్‌పీ పవర్, 200 ఎన్ఎమ్ టార్క్ సామర్థ్యాలు ఉన్నాయి. ఒక్కసారి ఛార్జ్‌తో 331 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 'ప్రో' వేరియంట్‌లో 52.9 కిలోవాట్ గంటల బ్యాటరీతో 449 కిలోమీటర్ల రేంజ్ అందుతుంది. అయితే పవర్ అవుట్‌పుట్ ఒకేలా ఉంటుంది. తక్కువ ధర, BaaS సౌలభ్యం, విశాలమైన క్యాబిన్, వెనక్కి వాలే సీట్లు, కుటుంబాలకు అనుకూలమైన క్రాసోవర్ డిజైన్, అధిక టెక్ ఫీచర్లు, ప్రీమియం కంఫర్ట్ ఆప్షన్లు, నమ్మకమైన ఛార్జింగ్ నెట్‌వర్క్ ఇవన్నీ విండ్సర్ ఈవీని పోటీదారులైన టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, టాటా కర్వ్ ఈవీల కంటే ముందంజలో నిలిపాయి.