
Mileage Issue: మైలేజీ విషయంలో మోసం.. ఎలక్ట్రిక్ కార్ సంస్థలకు భారీ జరిమానా
ఈ వార్తాకథనం ఏంటి
మైలేజీ విషయంలో తప్పుదారి పట్టించిన నియాన్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థలపై హైదరాబాద్ కమిషన్-2 వినియోగదారుల న్యాయమండలి తీవ్ర స్థాయిలో స్పందించింది.
వినియోగదారుడి మానసిక వేదనను దృష్టిలో పెట్టుకొని రెండు సంస్థలు కలిపి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని, అదనంగా రూ.10 వేలు కేసు ఖర్చులు చెల్లించాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మొత్తం తీర్పు వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లో చెల్లించాలి. ఆలస్యం జరిగితే 12 శాతం వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుందని కమిషన్ హెచ్చరించింది.
బల్కంపేటకు చెందిన చెన్నంశెట్టి సతీష్‌కుమార్ తాడ్‌బండ్‌లోని నియాన్ మోటార్స్ షోరూమ్ ద్వారా 2023 మార్చిలో ఎక్స్‌యూవీ-400 ఎలక్ట్రిక్ కారును రూ.19,63,306కి కొనుగోలు చేశారు.
Details
పట్టించుకోని కంపెనీ
కొనుగోలు సమయంలో కంపెనీ ప్రతినిధులు 100 శాతం ఛార్జింగ్‌తో 456 కిలోమీటర్లు, 80 శాతం ఛార్జింగ్‌తో 364 కిలోమీటర్ల మైలేజీ వస్తుందంటూ హామీ ఇచ్చారు.
అయితే, వాస్తవంగా వాహనం 240 కిలోమీటర్లకు మించి మైలేజీ ఇవ్వకపోవడంతో సతీష్‌కుమార్ నిరాశకు గురయ్యారు.
ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా, సమస్యను పరిష్కరించలేదని బాధితుడు తెలిపాడు.
వాహనాన్ని సర్వీసింగ్ కేంద్రానికి పంపినా మైలేజీలో ఎలాంటి మార్పు రాలేదు. ఎక్స్‌ఛేంజ్‌లో వేరే వాహనం ఇవ్వాలన్న విజ్ఞప్తినీ కంపెనీ పట్టించుకోలేదు.
Details
మైలేజీ విషయంలో సంయుక్తంగా అధ్యయనం
దీంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. దీనికి ప్రతివాద సంస్థలు ప్రతిస్పందిస్తూ ఆరోపణలను ఖండించాయి.
అయితే కమిషన్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని మైలేజీ విషయంలో సంయుక్తంగా అధ్యయనం జరిపింది.
టెస్ట్ డ్రైవ్ ద్వారా 11 శాతం బ్యాటరీతో కేవలం 23.7 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించగలిగినట్టు తేలింది.
ఈ నివేదిక ఆధారంగా కమిషన్ నిర్ణయం తీసుకుని, వినియోగదారుడికి న్యాయం చేస్తూ రెండు సంస్థలపై సంయుక్తంగా జరిమానా విధించింది.