Bajaj Chetak: కొత్త చేతక్ స్కూటర్లను లాంచ్ చేసిన బజాజ్ సంస్థ.. సింగిల్ ఛార్జ్‌తో 153km
బజాజ్ ఆటో విద్యుత్ వాహన రంగంలో చేతక్ ద్వారా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని, తాజాగా మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఈ స్కూటర్‌ను చేతక్ 35 సిరీస్‌లో రెండు వెర్షన్లుగా విడుదల చేసింది: 3501, 3502. 3501 ప్రీమియం మోడల్‌గా నిలవగా, దీని ధర రూ.1.27 లక్షలు (ఎక్స్‌షోరూమ్, బెంగళూరు)గా నిర్ణయించబడింది. 3502 మోడల్ ధర రూ.1.20 లక్షలు. అంతేకాక, ఈ సిరీస్‌లో మరో 3503 మోడల్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నారు. పాత చేతక్ ఈవీ మాదిరిగానే క్లాసిక్ లుక్‌ను కొనసాగిస్తూ, కొత్త మోడళ్లను బజాజ్ అందించింది. ఇందులో 3.5 kWh బ్యాటరీ, 4kW మోటార్ అమర్చారు. ఈ స్కూటర్ గరిష్ఠంగా 73 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి కేవలం 3 గంటల సమయం
సింగిల్ ఛార్జ్‌తో 153 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. బ్యాటరీని పూర్తి ఛార్జ్ చేసుకోవడానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఈ స్కూటర్‌లో 5 అంగుళాల టచ్ TFT డిస్‌ప్లేని కలిపి, మ్యాప్స్, కాల్ ఆన్సర్/రిజెక్ట్, మ్యూజిక్ కంట్రోల్ వంటి అధునాతన సదుపాయాలను అందించారు. భద్రత కోసం జియో ఫెన్స్, దొంగతన అలర్ట్, ప్రమాద గుర్తింపు, ఓవర్‌స్పీడ్ అలర్ట్ వంటి ఫీచర్లు జోడించారు.
3 లక్షల చేతక్ ఈవీలను విక్రయించిన బజాజ్
2020లో బజాజ్ తన తొలి చేతక్ మోడల్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం 3201, 3202, 2903, 3201 స్పెషల్ ఎడిషన్ పేరిట నాలుగు వెర్షన్లను విక్రయిస్తోంది. విద్యుత్ వాహన రంగంలో ప్రవేశించినప్పటినుంచి, బజాజ్ తన మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటూ వస్తోంది. ఇప్పటివరకు 3 లక్షల చేతక్ ఈవీలను విక్రయించిన బజాజ్, ఈ ఏడాది ఏప్రిల్‌లో 12 శాతంగా ఉన్న తన మార్కెట్ వాటాను డిసెంబర్ నాటికి 27 శాతానికి పెంచుకుంది. కొత్త ఫీచర్లతో కూడిన ఈ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్, ఓలా ఎస్1, ఏథర్ రిజ్తా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.