LOADING...
FASTag Major Changes: ఫాస్టాగ్‌కు కొత్త రూపం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
ఫాస్టాగ్‌కు కొత్త రూపం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

FASTag Major Changes: ఫాస్టాగ్‌కు కొత్త రూపం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 27, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం ఇవ్వడానికి సిద్ధమవుతోంది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద క్యూల్లో నిలబడే రోజులకు ముగింపు పలుకుతూ, వాహనం ఆపకుండా ప్రయాణిస్తూనే టోల్ చార్జీలు ఆటోమేటిక్‌గా కట్ అయ్యే కొత్త విధానాన్ని అమలు చేయనుంది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. 'లాజిస్టిక్స్ పవర్ సమ్మిట్ అండ్ అవార్డ్స్ 2026' కార్యక్రమంలో మాట్లాడుతూ, డిసెంబర్ 2026 నాటికి అనేక హైవేలపై ఈ అవరోధ రహిత టోల్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

వివరాలు

ఇక టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన అవసరం లేదు

ప్రస్తుతం ఫా స్టాగ్ ఉన్నప్పటికీ టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కొంతసేపు ఆగాల్సి వస్తోంది. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే వాహనం ఆగకుండా నేరుగా ప్రయాణిస్తూనే టోల్ చార్జీలు కట్ అవుతాయి. దీంతో సమయం ఆదా కావడమే కాకుండా ట్రాఫిక్ సమస్యలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ కొత్త వ్యవస్థలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీతో పాటు RFID ఆధారిత ఫాస్టాగ్ ఉపయోగించనున్నారు. హైటెక్ కెమెరాలు వాహన నంబర్ ప్లేట్లను స్కాన్ చేసి, సంబంధిత ఫాస్టాగ్ ఖాతా నుంచి టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా డెడక్ట్ చేస్తాయి. దీంతో డ్రైవర్లు బూత్ వద్ద ఆగడం, చెల్లింపుల కోసం వేచి ఉండడం వంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి.

వివరాలు

నిబంధనలు ఉల్లంఘిస్తే ఈ-నోటీసులు

కొత్త విధానంలో టోల్ చెల్లింపులు చేయని లేదా నిబంధనలు పాటించని వాహనదారులకు ఈ-నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. చెల్లింపులో విఫలమైతే ఫాస్టాగ్ నిలిపివేత, జరిమానాలు లేదా ఇతర వాహన సంబంధిత చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు. లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడమే లక్ష్యం దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే రవాణా ఖర్చులు తగ్గడం కీలకమని గడ్కరీ పేర్కొన్నారు. దేశంలో ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆర్థిక కారిడార్ల అభివృద్ధితో లాజిస్టిక్స్ ఖర్చులు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్లు IIT Madras, IIT Kanpur, IIM Bangaloreనివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు. పోలిస్తే అమెరికా, యూరప్ దేశాల్లో ఈ ఖర్చు సుమారు 12శాతం కాగా, చైనాలో 8-10 శాతం మధ్య ఉందని వివరించారు.

Advertisement

వివరాలు

హరిత ఇంధనాలపై దృష్టి

దేశం తన చమురు అవసరాల్లో 87 శాతం దిగుమతులపై ఆధారపడుతోందని గడ్కరీ తెలిపారు. ప్రతి సంవత్సరం భారీగా శిలాజ ఇంధనాల దిగుమతులతో పాటు కాలుష్యం కూడా పెరుగుతోందని చెప్పారు. అందుకే ప్రత్యామ్నాయ ఇంధనాలు, బయోఫ్యూయెల్స్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పర్యావరణహిత మార్గాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంలో మెరుగైన రహదారులు, వేగవంతమైన రవాణా వ్యవస్థలు, తక్కువ లాజిస్టిక్స్ ఖర్చులు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త టోల్ విధానం అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా వాహనదారుల ప్రయాణ అనుభవం పూర్తిగా మారిపోవడం ఖాయం.

Advertisement