Tata Nexon iCNG: సీఎన్‌జీ వేరియంట్‌లో నెక్సాన్ ఐసీఎన్‌జీ లాంచ్.. ధర ఎంతంటే?
ప్రపంచ ప్రఖ్యాత ఆటోమొబైల్ దిగ్గజం 'టాటా మోటార్స్' తమ నెక్సాన్ లైనప్‌లో కొత్త సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ 'నెక్సాన్ ఐసీఎన్‌జీ'ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటికే నెక్సాన్ లైనప్‌లో పెట్రోల్, డీజిల్, ఈవీ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చింది. నెక్సాన్ ఐసీఎన్‌జీ ప్రారంభ ధర రూ.8.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంటే, టాప్ వేరియంట్ ధర రూ.14.50 లక్షలుగా ఉంది. నెక్సాన్ ఐసీఎన్‌జీ మొత్తం 8 వేరియంట్లలో లభ్యం కానుంది. స్మార్ట్ (ఓ), స్మార్ట్ ప్లస్, స్మార్ట్ ప్లస్ ఎస్, ప్యూర్, ప్యూర్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్ ప్లస్ పీఎస్ వంటి వేరియంట్లలో ఉండనుంది.
అత్యాధునిక ఫీచర్లతో ముందుకు
ఈ వాహనం 1.2 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో తయారు చేశారు. ఇది 98 bhp శక్తిని, 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యేకమైన డ్యూయల్ సిలిండర్ సదుపాయంతో కార్గో ప్రాంతం మరింత విస్తృతంగా ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 10.25 ఇంచ్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 360 డిగ్రీల కెమెరా, లెథర్ సీట్లు, నావిగేషన్ డిస్‌ప్లే, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హాల్ కంట్రోల్, ఫ్రంట్ పవర్ విండోలు వంటి ఫీచర్లు ఉన్నాయి. సీఎన్‌జీ మోడ్‌లో కిలోగ్రాముకు 24 కిలోమీటర్ల ఇంధన సామర్థ్యాన్ని టాటా కంపెనీ హామీ ఇచ్చింది.