 
                                                                                Know Your Vehicle: ఎన్‌హెచ్‌ఏఐ కీలక నిర్ణయం.. ఇప్పుడు వాహన వివరాల ధృవీకరణ మరింత సులభం
ఈ వార్తాకథనం ఏంటి
ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులకు పెద్ద ఊరట కలిగించేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కొత్త నిర్ణయం తీసుకుంది. వాహన వివరాల ధృవీకరణ (Know Your Vehicle - KYV) ప్రక్రియను సులభతరం చేస్తూ మార్గదర్శకాలను సవరించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు మరింత సౌకర్యం లభిస్తుందని అధికారులు తెలిపారు. ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం, అవసరమైన ధృవీకరణ పూర్తి చేయని వాహనాల ఫాస్టాగ్ సేవలు తక్షణం నిలిపేయడం జరగదు. వినియోగదారులకు KYV ప్రక్రియ పూర్తి చేయడానికి తగిన సమయం ఇస్తారు.
వివరాలు
వాహన్ పోర్టల్ ద్వారా RC వివరాలు ఆటోమేటిక్‌గా పొందే సౌకర్యం
రోడ్డు రవాణా,రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఇకపై కార్లు,జీపులు,వాన్లకు సంబంధించిన పక్క ఫోటోలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం వాహన నంబర్ ప్లేట్,ఫాస్టాగ్ స్పష్టంగా కనిపించే ముందు ఫోటో మాత్రమే అప్‌లోడ్ చేయాలి. అదనంగా,వినియోగదారుడు వాహన నంబర్,ఛాసిస్ నంబర్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే, 'వాహన్' పోర్టల్ ద్వారా ఆ వాహనానికి సంబంధించిన RC వివరాలు ఆటోమేటిక్‌గా పొందే సదుపాయం కల్పించబడుతుంది. ఒకే మొబైల్ నంబర్‌తో అనేక వాహనాలు నమోదై ఉంటే,వినియోగదారుడు ఏ వాహనానికి KYV పూర్తి చేయాలనుకుంటున్నారో తామే ఎంపిక చేసుకోవచ్చు. సేవల్లో అంతరాయం రాకుండా ఉండేందుకు,KYV విధానం అమలు చేయకముందే జారీ చేసిన ఫాస్టాగ్‌లు యాక్టివ్‌గా కొనసాగుతాయని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
వివరాలు
KYV సంబంధిత సమస్యల కోసం 1033 హెల్ప్‌లైన్ ద్వారా బ్యాంకులను సంప్రదించవచ్చు.
అయితే,ట్యాగ్ దుర్వినియోగం లేదా దాని సడలింపు సంబంధిత ఫిర్యాదులు అందితే మాత్రం చర్యలు తీసుకుంటారని తెలిపింది. బ్యాంకులు వినియోగదారులకు KYV పూర్తి చేయమని SMS పంపిస్తాయి. పత్రాలు అప్‌లోడ్ చేసే సమయంలో ఏదైనా ఇబ్బంది ఎదురైతే, సంబంధిత బ్యాంకు వినియోగదారుడిని సంప్రదించి సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో సమస్యలు ఎదురైనప్పుడు వినియోగదారులు జాతీయ రహదారి హెల్ప్‌లైన్ నంబర్ 1033కు కాల్ చేసి తమ బ్యాంకును సంప్రదించవచ్చు. మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం,ఈ సులభతర విధానం ద్వారా వినియోగదారుల అనుభవం మెరుగుపడటమే కాకుండా, దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేయడం NHAI ప్రధాన లక్ష్యం అని పేర్కొంది.