Page Loader
Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..  
రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..

Nitin Gadkari: రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల నగదు రహిత చికిత్స..  

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 08, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఒక ముఖ్యమైన పథకాన్ని ప్రకటించారు. ఇందులో రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు ప్రత్యేక పథకం అమలు చేయబడుతుంది. ప్రమాదంలో గాయపడిన వారు మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే ఖర్చుకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. కానీ, ఈ పథకాన్ని ఉపయోగించాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని గడ్కరీ స్పష్టం చేశారు. హిట్ అండ్ రన్ కేసుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని ఆయన తెలిపారు.

వివరాలు 

2024లో 1.80 లక్షల మంది మృతి 

2024లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 1.80 లక్షల మంది మరణించడం అనేది ఆందోళన కలిగించే అంశమని గడ్కరీ పేర్కొన్నారు. వీటిలో 30 వేల మరణాలు హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరిగినవని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో 18 నుంచి 34 ఏళ్ల మధ్య వయస్సు గల యువత అధికంగా ఉన్నారని, దాదాపు 66 శాతం ప్రమాద బాధితులు ఈ వర్గానికి చెందినవారని వెల్లడించారు. గత ఏడాది విద్యాసంస్థల పరిసరాల్లో సరైన ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు లేకపోవడం వల్ల దాదాపు 10 వేల మంది పిల్లలు ప్రమాదాల్లో పడినట్లు గడ్కరీ పేర్కొన్నారు.

వివరాలు 

ఆటోరిక్షాలు, విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక నిబంధనలు 

ఈ పరిస్థితిని మార్చడానికి ఆటోరిక్షాలు, విద్యాసంస్థల మినీ బస్సుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక నిబంధనలను అమల్లోకి తీసుకురావలసి వచ్చిందని తెలిపారు. దిల్లీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రవాణా శాఖ మంత్రులతో సమావేశమైన గడ్కరీ, రోడ్డు రవాణా పాలసీల గురించి చర్చించారు. ఈ సమావేశం అనంతరం రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకాన్ని ప్రకటించారు,