ola: ఓలా నుంచి కొత్త స్కూటర్.. సింగిల్ ఛార్జింగ్‌తో 320 కిలో మీటర్లు చుట్టేయండిలా..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కొత్త స్కూటర్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. సొంతంగా అభివృద్ధి చేసిన 4680 భారత్ సెల్‌తో తయారు చేసిన ఎస్1 ఎక్స్+ 5.2 kWh వేరియంట్‌ను (Ola S1 X+) సోమవారం విడుదల చేసింది. దీని ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. ఇన్‌హౌస్‌లో రూపుదిద్దుకున్న సెల్ టెక్నాలజీ సాయంతో తయారు చేసిన స్కూటర్ కావడంతో అందుబాటు ధరలోకి తేవడం సాధ్యమైందని ఓలా ఎలక్ట్రిక్ ఓ ప్రకటనలో పేర్కొంది.
వివరాలు
సింగిల్ ఛార్జ్‌తో దూసుకుపోండిలా..
ఏప్రిల్ 15 వరకు ప్రారంభ ధర కింద రూ.1.29 లక్షలకు విక్రయించనున్నట్లు ఓలా తెలిపింది. ఇందులో 11kW మిడ్ డ్రైవ్ మోటార్‌ను అమర్చినట్లు వెల్లడించింది. సింగిల్ ఛార్జింగ్‌తో 320 కిలోమీటర్లు (IDC రేంజ్) ప్రయాణించొచ్చని పేర్కొంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 125 కిలోమీటర్లు. బ్రేకింగ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తూ బ్రేక్ బై వైర్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ సదుపాయంతో తీసుకొచ్చినట్లు ఓలా వెల్లడించింది.
వివరాలు
ఓలా నుంచి వచ్చిన వాహనాలివే..
ఓలా ఎలక్ట్రిక్ ఎస్1 ప్రో స్కూటర్లతో పాటు రోడ్‌స్టర్ విద్యుత్ మోటార్ సైకిళ్లను విక్రయిస్తోంది. ఎస్1 థర్డ్ జనరేషన్‌లో ఎస్1 ప్రో+ (5.2kWh, 4kWh), ఎస్ 1ప్రో (4 kWh, 3kWh) పేరుతో ప్రీమియం స్కూటర్లను విక్రయిస్తోంది. మాస్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఎస్1 ఎక్స్+ (4kWh), ఎస్ 1 ఎక్స్ (2, 3, 4 kWh) విక్రయిస్తోంది. రోడ్‌స్టర్ ఎక్స్+ను 4.5kWh, 9.1 kWh కాన్ఫిగరేషన్‌తోనూ, రోడ్‌స్టర్ ఎక్స్‌ను 2.5, 3.5, 4.5 kWh బ్యాటరీ సామర్థ్యంతోనూ విక్రయిస్తోంది. ఎస్1 ఎక్స్+ 5.2 kWh ఈ శ్రేణిలో కొత్తగా చేరింది.