LOADING...
Honda Activa Petrol VS Electric Scooter: ఎలక్ట్రిక్, పెట్రోల్‌ వెర్షన్‌లతో స్కూటర్లలో దేనివల్ల తక్కువ ఖర్చు అవుతుంది?
ఎలక్ట్రిక్,పెట్రోల్‌ వెర్షన్‌లతో స్కూటర్లలో దేనివల్ల తక్కువ ఖర్చు అవుతుంది?

Honda Activa Petrol VS Electric Scooter: ఎలక్ట్రిక్, పెట్రోల్‌ వెర్షన్‌లతో స్కూటర్లలో దేనివల్ల తక్కువ ఖర్చు అవుతుంది?

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 18, 2025
02:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇప్పటి కాలంలో వాహనం కలిగి ఉండటం అత్యవసరంగా మారింది.ముఖ్యంగా కారు లేదా బైక్/స్కూటర్ మన రోజువారీ జీవితంలో భాగంగా నిలిచిపోయాయి. చిన్న చిన్న దూరాల ప్రయాణాలకు చాలా మంది బైక్ కన్నా స్కూటర్‌ను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు,ఎందుకంటే ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో స్కూటర్‌ను నడపడం కాస్త సౌకర్యంగా ఉంటుంది. కూరగాయలు,ఆకుకూరలు కొనడం మొదలుకొని ఆఫీస్ వెళ్లే వరకు అనేక అవసరాలకు స్కూటర్ ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు భారత్‌లో పెట్రోల్‌తో నడిచే స్కూటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దేశంలోని ప్రతి మూలలో ఎలక్ట్రిక్ స్కూటర్లు కనిపిస్తున్నాయి.

వివరాలు 

ఎలక్ట్రిక్ స్కూటర్ Vs పెట్రోల్ స్కూటర్ - ఏది ఉత్తమం? 

దాదాపు అన్ని ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమతమ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. ఈ ఎలక్ట్రిక్ వాహనాల (EVలు) రాకతో ప్రజల దృక్పథంలో మార్పు వచ్చి, కొంత సందిగ్ధత కూడా ఏర్పడింది. ''పెట్రోల్ స్కూటర్ కొంటే బాగుంటుందా? లేక ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలా?''అనే సందేహంలో చాలామంది ఉంటున్నారు. భారత మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న స్కూటర్లలో హోండా యాక్టివా ఒకటి.ఇది పెట్రోల్ మోడల్‌తో పాటు ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. పెట్రోల్ స్కూటర్ వినియోగదారులలో కొంతమంది ఇప్పుడు ఎలక్ట్రిక్ మోడల్స్‌ వైపు మళ్లుతున్నారు. సాధారణంగా స్కూటర్ కొనాలనుకున్నప్పుడు,దాని ధర ఇతర మోడళ్లతో పోల్చి చూస్తారు కానీ కొనుగోలు తర్వాత నిర్వహణ ఖర్చును చాలా మంది పట్టించుకోరు.

వివరాలు 

హోండా యాక్టివా స్కూటర్ల ధరలు: 

నిజానికి, ఇది చాలా ముఖ్యమైన అంశం.స్కూటర్ నడపడం,నిర్వహించడం ఎంత తక్కువ ఖర్చుతో జరుగుతుందో ముందుగానే అంచనా వేయడం అవసరం. హోండా యాక్టివా పెట్రోల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 78,684నుండి మొదలై రూ. 84,685వరకు ఉంటుంది. హోండా యాక్టివా E ఎలక్ట్రిక్ మోడల్ ధర రూ.1,15,600నుండి ప్రారంభమై రూ. 1,17,000వరకు ఉంటుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రయోజనాలు: యాక్టివా E వేరియంట్‌లో రన్నింగ్ ఖర్చు తక్కువగా ఉంటుంది. మీరు ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను ఇంటి వద్ద లేదా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లో ఛార్జ్ చేసుకుంటే, పెట్రోల్ వ్యయంతో పోలిస్తే చాలా తక్కువ ఖర్చుతో నడుపుకోవచ్చు. నిర్వహణ పరంగా కూడా ఎలక్ట్రిక్ వాహనాలు చవకగా ఉంటాయి,ఎందుకంటే ఇవి తక్కువగా కదిలే భాగాలతో రూపొందించబడతాయి.

వివరాలు 

మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయి: 

ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన సర్వీస్ చేయగలిగే మెకానిక్స్ ఇప్పటికీ అందరికి అందుబాటులో లేరు. ఇక పెట్రోల్ వాహనాలకు అయితే సులభంగా సర్వీసింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. భారత్‌లో ఇంకా చాలిచోట్ల EVలకు అవసరమైన ఛార్జింగ్ సదుపాయాలు లేవు.పెట్రోల్ స్కూటర్ ఇంధనం అయిపోయినప్పుడు దగ్గరలోనే పెట్రోల్ బంక్ దొరుకుతుంది. కానీ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ అయిపోయినప్పుడు స్టేషన్ దొరకడం కష్టం.

వివరాలు 

ఎలక్ట్రిక్ స్కూటర్ - దీర్ఘకాలిక లాభం: 

ఎలక్ట్రిక్ వాహనంలో ఎప్పుడూ తగినంత ఛార్జింగ్ ఉండేలా చూసుకుంటే, ఇది పెట్రోల్ వాహనం కన్నా మెరుగైన ఎంపిక అవుతుంది. భవిష్యత్తులో పెట్రోల్ బంక్‌ల్లాగే ఛార్జింగ్ స్టేషన్‌లు కూడా విస్తృతంగా అందుబాటులోకి వస్తే, వీటిని ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటారు. ఒకప్పుడు ప్రజలు ఎలక్ట్రిక్ స్కూటర్ పనితీరు గురించి సందేహించేవారు. కానీ ఇప్పుడు మార్కెట్‌లో లభ్యమవుతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు పెట్రోల్ వాహనాల మాదిరిగానే పనితీరు ఇస్తున్నాయి. దగ్గర దూరాల ప్రయాణాల్లో ఇది బాగా పనికొస్తోంది. భారత ప్రభుత్వం కూడా EVల ప్రమోషన్‌ కోసం మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది.