Maruti Suzuki: మోదీ, జపాన్ ప్రధాని టకైచి చేతుల మీదుగా మారుతి సుజుకి ఖార్ఖోడా ప్లాంట్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి కలిసి హర్యానాలోని ఖార్ఖోడాలో మారుతి సుజుకీ నాలుగో తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇండియా-జపాన్ సంయుక్త ఆర్థిక వేదిక సందర్భంగా ఈ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కొత్త తయారీ కేంద్రం ద్వారా ప్రపంచ ఆటోమొబైల్ తయారీ రంగంలో భారత్ మరో ముందడుగు పడిందని పేర్కొన్నారు. భారత్-జపాన్ భాగస్వామ్య ప్రాధాన్యతను ప్రస్తావించిన ప్రధాని మోదీ.. "కవాసాకి, యమహా, హోండా బైక్‌లు కూడా ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నాయి. అలాగే ఎయిర్ కండీషనర్లు, పవర్ గ్రిడ్ పరికరాలు, వైద్య సాంకేతికత వంటి రంగాల్లో జపాన్ నైపుణ్యం.. భారత్ వేగం, సామర్థ్యంతో కలిస్తే ప్రపంచం మొత్తం ప్రయోజనం పొందుతుంది" అని అన్నారు.
వివరాలు
ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాల్లో ఒకటి..
ప్రపంచ సరఫరా గొలుసుల్లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని మోదీ తెలిపారు. "ప్రస్తుతం ప్రపంచం సరఫరా గొలుసు సమస్యలు, వాణిజ్య అనిశ్చితి, అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ తగ్గుదల వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కొనే వారే ముందుకు సాగుతారు" అని వ్యాఖ్యానించారు. సుమారు 800 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఖార్ఖోడా ప్లాంట్ ప్రారంభ దశలో ఏడాదికి 5 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేయనుంది. భవిష్యత్తులో దీనిని 10 లక్షల యూనిట్లకు పెంచే ప్రణాళిక ఉంది. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆటో మొబైల్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా నిలవనుంది.
వివరాలు
రూ.35,000 కోట్ల పెట్టుబడి..
ఈ ప్రాజెక్టు కోసం మారుతి సుజుకి రూ.35,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా 21 వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రెసిడెంట్, రిప్రజెంటేటివ్ డైరెక్టర్, చైర్మన్ తోషిహిరో సుజుకి మాట్లాడుతూ.. "భారత్-జపాన్ భాగస్వామ్య విజయానికి, 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఇది నిదర్శనం. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏర్పడిన అనుకూల విధానాల కారణంగా సుజుకి సంస్థ పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతులు, సాంకేతికత రంగాల్లో మరింత వేగంగా ముందుకు సాగుతోంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో మా వంతు పాత్రను మరింత బలోపేతం చేస్తున్నాం" అని తెలిపారు.
వివరాలు
2030 నాటికి 70 మెగావాట్లకు పెంచడమే లక్ష్యం..
ఖార్ఖోడా ప్లాంట్‌ను పర్యావరణ హిత సూత్రాలకు అనుగుణంగా అభివృద్ధి చేశారు. ఈ కేంద్రానికి అవసరమైన విద్యుత్‌ను ప్రధానంగా సౌరశక్తి సహా పునరుత్పాదక ఇంధన వనరుల ద్వారా సమకూరుస్తున్నారు. ప్రస్తుతం 20 మెగావాట్ల సామర్థ్యంతో ఉన్న సౌర విద్యుత్ వ్యవస్థను 2030 నాటికి 70 మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్లాంట్‌లో బయోగ్యాస్ యూనిట్‌తో పాటు శక్తి నిల్వ వ్యవస్థలు కూడా ఏర్పాటు చేశారు.
వివరాలు
అత్యాధునిక డిజిటల్ సాంకేతికతతో ప్లాంట్..
సుజుకి 'స్మార్ట్ ఫ్యాక్టరీ' కాన్సెప్ట్ ఆధారంగా నిర్మించిన ఈ ప్లాంట్‌లో అత్యాధునిక డిజిటల్ సాంకేతికతను వినియోగిస్తూ ఉత్పత్తి ప్రక్రియను రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తారు. అలాగే ఇండస్ట్రీ 5.0 విధానంలో భాగంగా మానవ ఉద్యోగులతో కలిసి పనిచేసే సహకార రోబోలను వినియోగిస్తున్నారు. దీంతో ఉత్పాదకత, భద్రత, నాణ్యత మరింత మెరుగుపడనుంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు 2025 ఫిబ్రవరిలో ప్రారంభం కాగా, దీనికి ప్రధాని మోదీ 2022 ఆగస్టులో శంకుస్థాపన చేశారు.