Vehicle Registration: వాహన కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్.. రిజిస్ట్రేషన్ ఇక షోరూంలోనే.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
వ్యక్తిగత అవసరాల కోసం కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నారు. గత ఏడాది డిసెంబరు 19న రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సంస్కరణలకు ఆమోదం తెలుపుతూ, డీలర్ల వద్దనే వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ చేపట్టాలని ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు రవాణా శాఖ యంత్రాంగం చర్యలు చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
వివరాలు
డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ సదుపాయం
డీలర్ల వద్దనే వాహన రిజిస్ట్రేషన్ చేయడానికి అవసరమైన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను 15 రోజులలోగా సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకు వాహన కొనుగోలుదారులు డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) మాత్రమే చేయించుకొని,శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. అక్కడ లంచాలు ఇస్తేనే పనులు పూర్తవుతున్నాయన్న ఆరోపణలు తరచూ వినిపించేవి. ఈ అవకతవకలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో డీలర్ వద్దనే రిజిస్ట్రేషన్ సదుపాయం అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో వాహన్, సారథి పోర్టళ్ల ద్వారా షోరూమ్‌ల్లోనే రిజిస్ట్రేషన్ జరుగుతోంది.
వివరాలు
కొత్త వాహనదారులు చేయాల్సింది ఇదే..
అయితే రాష్ట్రంలో ఈ పోర్టళ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడానికి ఇంకా ఆరు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉండటంతో, తక్షణమే అమలు చేసేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నారు. అధీకృత డీలర్ వద్ద శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పలు కీలక పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వాహన కొనుగోలు ఇన్వాయిస్ ఫారం-21 (విక్రయ ధ్రువీకరణ పత్రం) ఫారం-22 (రోడ్డు అనుకూలత ధ్రువీకరణ పత్రం) బీమా పాలసీ పత్రం కొనుగోలుదారుడి చిరునామా ధ్రువీకరణ పత్రం మరో వాహనం లేదని డిక్లరేషన్ కొనుగోలుదారుడి ఫొటో, సంతకం స్కాన్ కాపీలు వాహన ఇంజిన్ నంబర్, ఛాసిస్ నంబర్ ఫొటోలు అవసరాన్ని బట్టి రవాణా శాఖ సూచించే ఇతర పత్రాలు
వివరాలు
ఆర్‌సీ కార్డును స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా కొనుగోలుదారుడి చిరునామాకు..
డీలర్ ద్వారా వచ్చిన దరఖాస్తులను సంబంధిత రిజిస్టరింగ్ అథారిటీ లేదా అదనపు రిజిస్టరింగ్ అథారిటీ పరిశీలించి, నిబంధనల ప్రకారం ఆమోదం లేదా తిరస్కరణ చేస్తుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం వాహనానికి సంబంధించిన ఆర్‌సీ కార్డును స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా కొనుగోలుదారుడి చిరునామాకు పంపిస్తారు. అలాగే, అధీకృత డీలర్ల వద్ద ఉన్న వాహన నిల్వలను వెహికిల్ ఇన్‌స్పెక్టర్, ఆర్టీవో, డీటీసీ, జేటీసీ లేదా రవాణా కమిషనర్ ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం కలిగి ఉంటారు.