
Royal Enfield price cut: బైకు కొనుగోలుదారులకు శుభవార్త .. ధరలు తగ్గించిన రాయల్ ఎన్‌ఫీల్డ్
ఈ వార్తాకథనం ఏంటి
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 350 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్ల ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. జీఎస్టీ పన్ను సంస్కరణల నేపథ్యంలో ఈ ధరల సవరణ సెప్టెంబర్ 22 నుండి అమల్లోకి రానుంది. కంపెనీ జీఎస్టీ తగ్గింపు లాభాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ముందు 350 సీసీ మోటార్‌సైకిళ్లపై జీఎస్టీ రేటు 28 శాతం ఉండేది, అది ఇప్పుడు 18 శాతానికి తగ్గింది. అలాగే, 350 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన మోడళ్లపై ఇప్పటికీ 40 శాతం పన్ను వర్తిస్తూనే ఉంది. ఈ పరిణామంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా ఇతర టూ-వీలర్ కంపెనీల లాగా తమ ప్రముఖ మోడళ్ల ధరలను తగ్గించింది.
వివరాలు
పెరగనున్న 350 సీసీ మోడళ్లు
తాజా నిర్ణయంతో క్లాసిక్ 350, హంటర్ 350, మెటోర్ 350 మోడళ్ల ధరలు రూ.22,000 వరకు తగ్గనున్నాయి. ప్రస్తుతం,క్లాసిక్ 350 మోడల్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.1,97,253 నుంచి రూ.2,30,000 వరకు (మోడల్ ఆధారంగా) ఉంది. హంటర్ మోడల్ ధరలు రూ.1,49,900 నుంచి ప్రారంభమై రూ.1,74,655 వరకు ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి.గోవిందరాజన్ మాట్లాడుతూ,జీఎస్టీ తగ్గింపు వల్ల మోటార్‌సైకిళ్ల ధరలు తగ్గడం తో పాటు, కొత్తగా బైకులు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు ఇది ప్రేరణగా మారతుందని అభిప్రాయపడ్డారు. జీఎస్టీ ప్రయోజనాన్ని పూర్తిగా వినియోగదారులకు బదిలీ చేస్తున్నామని గోవిందరాజన్ చెప్పారు . అయితే, 350 సీసీ మోడళ్ల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్ల ధరలు పెరగనున్నాయని కూడా తెలిపారు.
వివరాలు
అదే బాటలో హీరో మోటోకార్ప్
జీఎస్టీ తగ్గింపును అనుసరిస్తూ సెప్టెంబర్ 22 నుండి హీరో మోటోకార్ప్ తమ మోటార్‌సైకిళ్ల ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో వారు వివిధ మోడళ్లపై రూ.15,743 వరకు ధర తగ్గింపునకు వెళ్తున్నట్లు తెలిపారు. హీరో మోటోకార్ప్ "స్ప్లెండర్ ప్లస్, గ్లామర్, ఎక్స్‌ట్రీమ్, జూమ్, డెస్టినీ, ప్లెజర్+" పేరుతో మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు విక్రయిస్తూ వస్తోంది. తాజా నిర్ణయంతో ఈ మోడళ్ల ధరలు తగ్గనున్నాయి. ఇప్పటికే టీవీఎస్, బజాజ్ ఆటో వంటి ఇతర టూ-వీలర్ కంపెనీలు కూడా తమ ధరల తగ్గింపును ప్రకటించారు.