Mahindra Vision S: స్కార్పియో-ఎన్‌కు మినీ అవతారం.. మహీంద్రా విజన్ ఎస్ ఎప్పుడు రోడ్డెక్కుతుంది?
ఈ వార్తాకథనం ఏంటి
ఎస్‌యూవీలకు మారుపేరుగా నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా తన ఉత్పత్తుల శ్రేణిలో మరో కీలక మోడల్‌ను చేర్చేందుకు సిద్ధమవుతోంది. 'విజన్ ఎస్' పేరుతో రానున్న ఈ కొత్త ఎస్‌యూవీ ఇప్పటికే పలుమార్లు భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్‌ల సమయంలో కనిపించింది. తాజాగా మరోసారి ఈ మోడల్ స్పై షాట్స్‌లో దర్శనమిచ్చింది. వాహనాన్ని భారీగా కప్పి ఉంచినప్పటికీ, మహీంద్రా ఒక ప్రత్యేకమైన, పర్పస్-డ్రివెన్ ఎస్‌యూవీపై పని చేస్తోందన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఈ మహీంద్రా విజన్ ఎస్ 2027 ప్రారంభంలో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Details
మహీంద్రా విజన్ ఎస్ - డిజైన్, ఎక్స్‌టీరియర్
మహీంద్రా విజన్ ఎస్ బెస్ట్ సెల్లింగ్ స్కార్పియో ఫ్యామిలీలో భాగంగా నిలవనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఇది స్కార్పియో-ఎన్‌కు చిన్న వర్షన్‌గా ఉండే అవకాశాలున్నట్లు ఆటో వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా విడుదలైన స్పై వీడియోలను గమనిస్తే, ఈ ఎస్‌యూవీ బాక్సీగా, నిటారుగా ఉండే సిల్హౌట్‌ను కలిగి ఉండి అసలైన ఎస్‌యూవీ క్యారెక్టర్‌ను ప్రతిబింబిస్తోంది. ముందు భాగంలో రౌండ్ హెడ్‌ల్యాంప్స్, వర్టికల్ స్లాట్‌లతో కూడిన బోల్డ్ గ్రిల్, ప్రముఖ మహీంద్రా బ్యాడ్జ్ కనిపిస్తున్నాయి. స్క్వేర్డ్ వీల్ ఆర్చ్‌లు, చంకీ బాడీ క్లాడింగ్, ఫ్లాట్ బాడీ ప్యానెల్‌లు వాహనానికి రగ్డ్ లుక్‌ను అందిస్తున్నాయి. వెనుక భాగంలో నిలువుగా అమర్చిన టెయిల్ ల్యాంప్స్, నిటారుగా ఉండే టెయిల్‌గేట్, టెయిల్‌గేట్‌పై అమర్చిన స్పేర్ వీల్ వంటి అంశాలు కనిపిస్తున్నాయి.
Details
మార్పులు చేసే అవకాశం
ఈ ఎస్‌యూవీలో రెండు వైపులా ఫ్లష్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఉండటం గమనార్హం. అయితే భద్రతా కారణాల రీత్యా ఇటీవల చైనా ఈ తరహా డోర్ హ్యాండిల్స్‌ను నిషేధించింది. ఇతర దేశాలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశముండటంతో, లాంచ్ సమయానికి మహీంద్రా ఈ డిజైన్‌ను కొనసాగిస్తుందా లేదా మార్పులు చేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.
Details
మహీంద్రా విజన్ ఎస్ - ఇంటీరియర్, ఫీచర్లు
ఇంటీరియర్ వివరాలు ఇప్పటివరకు అధికారికంగా వెల్లడికాలేదు. అయితే, ప్రస్తుతం ఉన్న మహీంద్రా మోడళ్లతో పోలిస్తే విజన్ ఎస్ మరింత ఆధునిక ఫీచర్లతో రానుందని అంచనా. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మల్టిపుల్ యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండవచ్చని భావిస్తున్నారు. భద్రత పరంగా ఏబీఎస్ విత్ ఈబీడీ, ట్రాక్షన్ కంట్రోల్, స్టెబిలిటీ కంట్రోల్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు సమాచారం.
Details
మహీంద్రా విజన్ ఎస్ - మెకానికల్, ప్లాట్‌ఫారమ్
మహీంద్రా విజన్ ఎస్‌ను కొత్త తరం 'ఫ్రీడమ్ ఎన్.యూ' ప్లాట్‌ఫారమ్‌పై అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్లాట్‌ఫారమ్ మెరుగైన రైడ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్‌ను అందించడమే కాకుండా, భవిష్యత్తులో వచ్చే ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లకు కూడా అనుకూలంగా ఉండడం విశేషం. దీని ద్వారా మహీంద్రా తన ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు విజన్ ఎస్ కీలకంగా మారనుంది. ఈ ఎస్‌యూవీకి సంబంధించిన ఇంజిన్ ఆప్షన్లు, వేరియంట్లు, ధరల వివరాలు లాంచ్‌కు సమీపంలో అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.