BMW Price Hike: బీఎండబ్ల్యూ వినియోగదారులకు షాక్.. వచ్చే జనవరి నుంచి ధరల పెరుగుదల
భారత మార్కెట్లో లగ్జరీ కార్ల ధరలు త్వరలో మరింత ప్రీమియం కానున్నాయి. ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఇండియా, తన వాహన శ్రేణిలోని అన్ని మోడళ్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని బీఎండబ్ల్యూ స్పష్టం చేసింది. ఉత్పత్తి వ్యయం పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. భారతీయంగా ఉత్పత్తి అయ్యే బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే, 3 సిరీస్, 5 సిరీస్, ఎక్స్1, ఎక్స్3, ఎక్స్5, ఎక్స్7 వంటి మోడళ్లతో పాటు దిగుమతి చేసుకునే ఐ సిరీస్ (i4, i5, i7), స్పోర్ట్స్ మోడళ్లపై కూడా ధరలు పెరుగుతాయి.
3శాతం పెంచుతున్నట్లు ప్రకటన
ప్రస్తుత ధరలు రూ.56 లక్షల నుంచి ప్రారంభమవుతున్న బీఎండబ్ల్యూ కారు ధరల పెంపు కనిష్ఠంగా లక్షల రూపాయల్లో ఉంటుందని అంచనా. ఇక మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా 2025 జనవరి 1 నుంచి తన కార్ల ధరలను 3 శాతం పెంచనున్నట్లు ఇటీవల ప్రకటించింది. ఈ పెరుగుదల వల్ల మెర్సిడెస్ కార్ల ధరలు కనిష్ఠంగా రూ.2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ.9 లక్షల వరకు పెరుగుతాయని అంచనా. ఉత్పత్తి, నిర్వహణ వ్యయాలు పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ పేర్కొంది. ప్రస్తుతం మెర్సిడెస్ భారతీయ మార్కెట్లో రూ.45 లక్షల ఏ క్లాస్ కార్ల నుంచి రూ.3.6 కోట్ల జీ63 ఎస్‌యూవీ వరకు విక్రయిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పెరిగే ఛాన్స్
లగ్జరీ కార్ల ధరల పెరుగుదల, ప్రీమియం మార్కెట్లో కొనుగోలుదారులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు పెరగవచ్చునని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత మార్కెట్లో లగ్జరీ కార్ల కోసం పోటీ పడుతున్న బ్రాండ్లు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల నేపథ్యంలో తమ ధరలను సవరించడం అనివార్యమైంది. దీని ప్రభావం వినియోగదారుల కొనుగోలు నిర్ణయాలపై ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంది.