LOADING...
Tesla discount: భారత్‌లో టెస్లాకు ఎదురుదెబ్బ.. మోడల్‌ Yపై రూ.2 లక్షల డిస్కౌంట్‌!
భారత్‌లో టెస్లాకు ఎదురుదెబ్బ.. మోడల్‌ Yపై రూ.2 లక్షల డిస్కౌంట్‌!

Tesla discount: భారత్‌లో టెస్లాకు ఎదురుదెబ్బ.. మోడల్‌ Yపై రూ.2 లక్షల డిస్కౌంట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 16, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నో అంచనాల మధ్య భారత్‌లోకి అడుగుపెట్టిన 'టెస్లా'కు ప్రారంభ దశలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. అమ్మకాలు ఊహించిన స్థాయిలో లేకపోవడంతో, కంపెనీ డిస్కౌంట్ల బాట పట్టింది. దేశీయంగా విక్రయిస్తున్న మోడల్‌ వై (Model Y)పై రూ.2 లక్షల వరకు రాయితీలు అందిస్తోంది. దిగుమతి చేసుకున్న స్టాక్‌ను క్లియర్‌ చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది. గతేడాది టెస్లా సుమారు 300 మోడల్‌ వై కార్లను భారత్‌కు దిగుమతి చేసుకుంది. అయితే అందులో దాదాపు మూడోవంతు కార్లు ఇప్పటికీ విక్రయానికి నోచుకోలేదని సమాచారం. ఈ కార్లు నెలల తరబడి షోరూమ్‌లకే పరిమితమవడంతో, వాటిని ఎలాగైనా విక్రయించాలనే ఉద్దేశంతో కంపెనీ వివిధ రూపాల్లో రూ.2 లక్షల వరకు డిస్కౌంట్లు ఇస్తోంది.

Details

టెస్ట్ డ్రైవ్ దశలో రాయితీలు

నేరుగా ధరను తగ్గించకుండా, కస్టమర్లతో చర్చల సమయంలో టెస్ట్‌ డ్రైవ్‌ దశలో ఈ రాయితీలను ఆఫర్‌ చేస్తోందని బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. కస్టమర్‌ ప్రొఫైల్‌ను బట్టి ఈ ప్రోత్సాహకాల్లో మార్పులు ఉంటున్నట్లు సమాచారం. భారత్‌లో టెస్లా మోడల్‌ వై కారును రూ.60 లక్షల ధరకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రారంభంలో ఈ కారు కొనుగోలుపై పెద్ద సంఖ్యలో ఆసక్తి వ్యక్తమైనప్పటికీ, బుకింగ్‌ దశకు వచ్చేసరికి ఆ సంఖ్య వందలకు పరిమితమైంది. అందులోనూ రిజిస్ట్రేషన్‌ వరకు వెళ్లింది కొద్దిమందే. అధిక ధర కారణంగా మోడల్‌ వై లగ్జరీ సెగ్మెంట్‌లోకి వెళ్లిపోయింది.

Details

కస్టమర్లను ఆకట్టుకోవడంలో విఫలం

అదే ధరలో బీఎండబ్ల్యూ, బీవైడీ వంటి బ్రాండ్లు మరింత మెరుగైన ఫీచర్లతో కార్లను అందిస్తుండటంతో, టెస్లా మోడల్‌ వై కస్టమర్లను ఆకట్టుకోవడంలో వెనుకబడిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు, భారత మార్కెట్‌లో కార్యకలాపాలను బలోపేతం చేసేందుకు టెస్లా ఇటీవల కొత్త లీడర్‌షిప్‌ను నియమించింది. భవిష్యత్‌లో ఎలాంటి వ్యూహాలతో కంపెనీ ముందుకు సాగుతుందో, ధరలు, ఉత్పత్తుల పరంగా ఎలాంటి మార్పులు తీసుకువస్తుందో చూడాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement