నిరీక్షణకు తెర.. హార్లే-డేవిడ్‌సన్ X440 సూపర్ బైక్ వచ్చేసింది
ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హార్లీ డేవిడ్‌సన్ X440 ను ఎట్టకేలకు ఆ సంస్థ రిలీజ్ చేసింది. ఈ సరికొత్త బైక్‌ని హీరో మోటర్ కార్ప్‌తో కలిసి హార్లీ సంయుక్తంగా అభివృద్ధి చేసింది. అనేక కారణాల వల్ల హార్లీ డేవిడ్‌సన్ X440 విడుదల ఆలస్యమైంది. తాజాగా ఈ ఉత్కంఠకు తెరతీసినట్లైంది. ఈ హార్లీ డేవిడ్సన్ ధర రూ.2.29 లక్షల నుంచి ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఈ బైక్ కావాలంటే రూ. 25వేలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. హార్లే X440 రాజస్థాన్‌లోని నీమ్రానాలోని హీరోస్ ఫెసిలిటీలో తయారైంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో 27bhp, 38Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా హార్లే డేవిడ్‌సన్
కోవిడ్-19 సమయంలో హార్లే ఇండియాలో తన తయారీ కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించుకుంది. ఎందుకంటే రూ.5.34 లక్షలకు విక్రయిస్తున్న స్ట్రీట్ 750 వంటి ఎంట్రీ-లెవల్ మోడల్‌లకు కూడా హార్లే తనకంటూ ఒక వెండర్ బేస్‌ను నిర్మించుకోలేకపోయింది. భారత్‌లో హార్లే-డేవిడ్‌సన్ మోటార్‌సైకిళ్లపై 50 శాతం టారిఫ్‌లు ఆమోదయోగ్యం కాదని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2019లో చెప్పిన విషయం తెలిసిందే. దీంతో హార్లే-డేవిడ్సన్ ఇండియాలోని హీరో మోటోకార్ప్‌తో కలిసి ఒప్పందం కుదుర్చుకుంది.ఈ రెండు కంపెనీలు చేతులు కలిపిన మూడు సంవత్సరాల తర్వాత హార్లీ డేవిడ్ సన్ X440 బైకును ప్రారంభించారు. ప్రస్తుతం మిడిల్ వెయిట్ విభాగంలో తమ హవాను కొనసాగిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆధిపత్యానికి హార్లీ డేవిడ్ సన్ X440 అడ్డుకట్ట వేయనుంది.