Page Loader
Buying Used Car: సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలంటే.. ఈ అంశాలను తప్పక పరిశీలించండి, లేకపోతే నష్టమే! 
సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలంటే.. ఈ అంశాలను తప్పక పరిశీలించండి, లేకపోతే నష్టమే!

Buying Used Car: సెకండ్‌ హ్యాండ్ కారు కొనుగోలు చేయాలంటే.. ఈ అంశాలను తప్పక పరిశీలించండి, లేకపోతే నష్టమే! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 09, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంట్లో ఉపయోగానికి, కుటుంబంతో కలసి ప్రయాణాల కోసం సొంత కారు ఉండాలన్నది చాలా మందికి కలగా ఉంటుంది. అయితే, అధిక ధరలు, ఆర్థిక పరిస్థితుల వంటివే కొన్ని కారణాల వల్ల కొత్త కారు కొనడం సాధ్యపడదు. దీంతో చాలామంది పాత కారు కొనాలని నిర్ణయిస్తారు. అయితే, వాడిన కారు (Used Car) కొనాలంటే మాత్రం కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుని, జాగ్రత్తగా వ్యవహరించాలి. లేనిపక్షంలో అనవసర సమస్యలు తలెత్తే అవకాశముంది.

వివరాలు 

1. ముందుగానే బడ్జెట్ నిర్ణయించుకోండి 

పాత కారు కొనేటప్పుడు చేయాల్సిన మొదటి పని మీ ఖర్చు సామర్థ్యాన్ని నిర్ణయించుకోవడం. బడ్జెట్‌ను దాటి వెళ్ళే ఎంపికలు ఆర్థిక ఒత్తిడికి కారణమవుతాయి. అందువల్ల, మీకు నచ్చిన కారును మార్కెట్‌లో ఏ ధరకు అమ్ముతున్నారో, మళ్ళీ అమ్మితే దాని విలువ ఎంతో తెలుసుకోవాలి. పలు ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ వేదికలపై ఆ కారుకు ఉన్న ధరను పరిశీలించండి. మీ సామర్థ్యానికి అనుగుణంగా సరైన ప్లాట్‌ఫాం‌ను ఎంచుకోండి.

వివరాలు 

2. కారును నడిపి పరీక్షించండి 

ఒక పాత కారు మీకు నచ్చితే, వెంటనే కొనకుండా ముందుగా దానిని నడిపి చూడండి. కేవలం కొద్దిసేపు తిరగడం సరిపోదు. వీలైతే ఎక్కువ దూరం డ్రైవ్ చేయండి. అలా చేయడం వల్ల ఆ కారు పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుంది. ఏదైనా లోపం ఉంటే ముందుగానే తెలిసే అవకాశం ఉంటుంది. అనుభవం ఉన్న వ్యక్తిని కూడా మీతో తీసుకెళ్లి, అతనితో కూడా కారును పరీక్షించండి.

వివరాలు 

3. మరమ్మతులకు అయ్యే ఖర్చును అంచనా వేయండి 

టెస్ట్ డ్రైవ్ తర్వాత మీరు గమనించిన లోపాలు, మార్కెట్‌లో ఆ కారుకు ఉన్న విలువ, అమ్మదలచిన ధర మొదలైన అంశాల ఆధారంగా ఖర్చు అంచనా వేయాలి. లోపాలుంటే వాటికి మరమ్మత్తులు చేయించేందుకు ఎంత ఖర్చవుతుందో ముందుగానే లెక్కవేయండి. ఆ తర్వాత అది అమ్మే ధర నుంచి తగ్గించాలని అడగండి. లేకపోతే, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేసి ఇవ్వమని స్పష్టంగా చెప్పండి. మొత్తంగా, మీ డబ్బుకు న్యాయం చేసే కారునే ఎంచుకోండి.

వివరాలు 

4. అనుభవజ్ఞుడైన మెకానిక్‌ ద్వారా తనిఖీ చేయించండి 

వాడిన కారులో మీకు కనిపించని లోపాలు ఉండే అవకాశం ఉంది. అందుకే, నమ్మకమైన మెకానిక్ లేదా కార్ కంపెనీకి చెందిన అధికారిక సర్వీస్ సెంటర్ వద్ద కారును పూర్తిగా తనిఖీ చేయించాలి. దీని ద్వారా అంతర్గతంగా ఉన్న సమస్యలేమైనా ఉంటే తెలుసుకోవచ్చు. ఈ దశను ఏలా అయినా విడిచిపెట్టకూడదు.

వివరాలు 

5. సర్వీస్‌ రికార్డును పరిశీలించండి 

కారు గతం గురించి తెలుసుకోవాలంటే సర్వీస్ రికార్డ్‌ చూసే అలవాటు పెట్టుకోండి. కారుకు ఎన్ని సార్లు సర్వీస్ చేశారో, ఎలాంటి పనులు చేసారో, కొత్తగా ఏఏ భాగాలు మార్చారో తెలియజేసే సమాచారం ఇందులో లభిస్తుంది. 6. కారుకు సంబంధించిన పత్రాలను సరిగ్గా పరిశీలించండి చివరిగా, ఆ కారుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడం చాలా అవసరం. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో ఉన్న ఛాసిస్ నంబర్ & ఇంజిన్ నంబర్‌ను వాహనంపై ఉన్న వాటితో పోల్చి చూసుకోవాలి. సరిపోలనట్లయితే, ఆ కారు విషయంలో తేడా ఉందని గ్రహించాలి. అటువంటి కారును కొనడం మానేయండి.