Hybrid vehicle: పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ పవర్.. జెనెసిస్ GV80లో అదిరిపోయే ఫీచర్లు!
ఈ వార్తాకథనం ఏంటి
హ్యుందాయ్‌కు చెందిన లగ్జరీ కార్ బ్రాండ్ జెనెసిస్ తొలిసారిగా హైబ్రిడ్ వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. జెనెసిస్ GV80 హైబ్రిడ్ పేరుతో ఈ కొత్త మోడల్‌ను విడుదల చేసింది. ఇందులో టర్బోచార్జ్డ్ 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు హ్యుందాయ్ గ్రూప్ అభివృద్ధి చేసిన నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సిస్టమ్‌ను ఉపయోగించారు. బ్యాటరీ ఉష్ణోగ్రతను మెరుగ్గా నియంత్రించడంతో పాటు సామర్థ్యాన్ని పెంచేందుకు లిక్విడ్-కూల్డ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు. జెనెసిస్ GV80 హైబ్రిడ్‌లో స్టార్టర్-జనరేటర్ మోటార్, డ్రైవ్ మోటార్‌తో కూడిన ప్రత్యేకమైన పవర్‌ట్రెయిన్‌ను ఉపయోగించారు. స్టార్టర్-జనరేటర్ మోటార్ ఇంజిన్‌ను స్టార్ట్ చేయడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
వివరాలు
అద్భుతమైన ఫీచర్లు..
మరోవైపు డ్రైవ్ మోటార్ వాహనాన్ని ముందుకు నడిపించడంతో పాటు రీజెనరేటివ్ బ్రేకింగ్ బాధ్యతను నిర్వహిస్తుంది.
ఈ ప్రత్యేకమైన వ్యవస్థలో సాధారణంగా ఉండే రివర్స్ గేర్ అవసరం లేకుండా డిజైన్ చేశారు.
దీంతో వాహనం నిర్మాణంలో ఉండే సంక్లిష్టతను తగ్గించారు. జెనెసిస్ అంతర్గతంగా నిర్వహించిన పరీక్షల్లో.. సాధారణ పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే ఈ హైబ్రిడ్ సిస్టమ్ ఇంధన సామర్థ్యాన్ని 25 శాతం వరకు మెరుగుపరిచినట్లు వెల్లడైంది.
ఇక GV80 హైబ్రిడ్ పవర్ విషయంలోనూ గణనీయమైన మార్పులు చేసింది.
సాధారణ మోడల్‌లో 300 హెచ్‌పీగా ఉన్న పవర్‌ను దాదాపు 16 శాతం పెంచి 347 హెచ్‌పీకి తీసుకెళ్లారు.
వివరాలు
కంట్రోల్ సిస్టమ్ అదుర్స్..
టార్క్ కూడా సుమారు 26 శాతం పెరిగింది. 422 ఎన్ఎం నుంచి ఏకంగా 530 ఎన్ఎంకు చేరింది.
ఈ మెరుగుదలల కారణంగా GV80 హైబ్రిడ్ కేవలం 7.1 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
ఈ కారులో 'స్టే మోడ్' అనే ప్రత్యేక ఫీచర్‌ను కూడా అందించారు. దీని ద్వారా పెట్రోల్ ఇంజిన్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ బ్యాటరీ నుంచి విద్యుత్‌ను ఉపయోగించుకుని కారులోని క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్‌ను పనిచేసేలా ఉంచుకోవచ్చు.
అలాగే మెరుగైన రీజెనరేటివ్ బ్రేకింగ్ కోసం కారు నావిగేషన్ డేటా, స్పీడ్ కెమెరాల సమాచారం, ముందున్న వాహనాలతో ఉన్న దూరం వంటి వివరాలను ఉపయోగించుకుంటుంది.
దీంతో డ్రైవింగ్ సమయంలో విద్యుత్‌ను మరింత సమర్థవంతంగా తిరిగి ఉత్పత్తి చేసుకోవచ్చు.