LOADING...
7 seater cars : నెల రోజుల్లో మూడు 7-సీటర్ కార్లు.. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకూ!
నెల రోజుల్లో మూడు 7-సీటర్ కార్లు.. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకూ!

7 seater cars : నెల రోజుల్లో మూడు 7-సీటర్ కార్లు.. బడ్జెట్ నుంచి లగ్జరీ వరకూ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 10, 2026
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ఆటో మొబైల్‌ మార్కెట్‌లో వచ్చే ఏడాది ఎంపీవీ సెగ్మెంట్ మరింత రద్దీగా మారనుంది. బడ్జెట్ నుంచి లగ్జరీ, ఎలక్ట్రిక్ వరకు విభిన్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు కీలక కంపెనీలు తమ కొత్త ఎంపీవీలను విడుదలకు సిద్ధం చేస్తున్నాయి. నిస్సాన్ ఇండియా తన కొత్త బడ్జెట్‌ ఫ్రెండ్లీ 7-సీటర్ ఎంపీవీ 'గ్రావిటీ'ని ఫిబ్రవరి 17, 2026న అధికారికంగా ఆవిష్కరించనుంది.

Details

నిస్సాన్ గ్రావిటీ

ఇప్పటికే మార్కెట్‌లో మంచి ఆదరణ పొందిన రెనాల్ట్ ట్రైబర్‌తో సమానమైన ప్లాట్‌ఫామ్‌పై ఈ మోడల్‌ను అభివృద్ధి చేశారు. డిజైన్ పరంగా ట్రైబర్ బాడీకి సమానంగా కనిపించినప్పటికీ, నిస్సాన్ ప్రత్యేకమైన 'వీ-మోషన్' ఫ్రంట్ గ్రిల్, కొత్త స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్, స్పోర్టీ బంపర్‌తో దీనికి కొత్త గుర్తింపు ఇచ్చింది. లోపలి భాగంలో ఆల్-బ్లాక్ ఇంటీరియర్‌తో పాటు డోర్ల వద్ద బేజ్ కలర్ టచ్ ఇచ్చారు. 3-స్పోక్ స్టీరింగ్ వీల్‌తో పాటు, అవసరాన్ని బట్టి పూర్తిగా తీసివేయగలిగే మూడో వరుస సీట్లు ఈ కారుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇందులో 1.0లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను అందించనున్నారు. ఇది 72 బీహెచ్‌పీ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఆటోమేటిక్ (ఏఎంటీ) గేర్‌బాక్స్ ఆప్షన్లు కూడా లభించనున్నాయి.

Details

మెర్సిడెస్ బెంజ్ వి-క్లాస్

విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని మెర్సిడెస్ బెంజ్ తన వి-క్లాస్ ఎంపీవీని సరికొత్త హంగులతో మార్చ్ 3, 2026న మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఎంపీవీ క్యాబిన్‌లో రెండు పెద్ద డిజిటల్ డిస్‌ప్లేలు—ఒకటి టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డ్రైవర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం అందించనున్నారు. విశాలమైన అంతర్గత స్థలం, ప్రీమియం సీట్లతో ఇది 'రోడ్లపై నడిచే విమానం'లా అనుభూతిని ఇస్తుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో 2.0లీటర్ 4-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 158బీహెచ్‌పీ పవర్, 380ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. టయోటా వెల్‌ఫైర్‌కు నేరుగా పోటీగా నిలిచే ఈ వి-క్లాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.10కోట్ల నుంచి రూ. 1.25 కోట్ల మధ్య ఉండొచ్చని అంచనా.

Advertisement

Details

విన్‌ఫాస్ట్ లిమో గ్రీన్

వియత్నాంకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం విన్‌ఫాస్ట్, భారత్‌లో తన మూడో మోడల్‌గా 'లిమో గ్రీన్' ఎలక్ట్రిక్ ఎంపీవీని ఫిబ్రవరి-మార్చ్ 2026 మధ్యలో విడుదల చేయనుంది. ఈ ఈవీలో 60.13 కిలోవాట్-అవర్ బ్యాటరీ ప్యాక్‌ను అందించనున్నారు. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 450 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఛార్జింగ్ విషయంలో కూడా ఇది ఆధునిక సదుపాయాలతో వస్తోంది. 80 కేడబ్ల్యూ డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 30 నిమిషాల్లోనే 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుంది. తక్కువ ధరలోనే అందుబాటులోకి రానున్న ఈ ఎలక్ట్రిక్ ఎంపీవీ, భారత మార్కెట్‌లో కియా క్యారెన్స్ ఈవీకి గట్టి పోటీగా నిలవనుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.

Advertisement