LOADING...
Toyota: టయోటాకు భారీ షాక్.. గ్లోబల్ మార్కెట్లో జపాన్ ఆటో కంపెనీలకు గట్టి దెబ్బ
టయోటాకు భారీ షాక్.. గ్లోబల్ మార్కెట్లో జపాన్ ఆటో కంపెనీలకు గట్టి దెబ్బ

Toyota: టయోటాకు భారీ షాక్.. గ్లోబల్ మార్కెట్లో జపాన్ ఆటో కంపెనీలకు గట్టి దెబ్బ

వ్రాసిన వారు Moogati Shabari
May 28, 2026
03:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ టొయోటా మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అమ్మకాలు వరుసగా మూడో నెల కూడా తగ్గుముఖం పట్టాయి. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ నెలలో మొత్తం వాహనాల విక్రయాలు 3.7 శాతం తగ్గి 9.02 లక్షల యూనిట్లకు చేరాయి. అయితే ఉత్పత్తి మాత్రం 3.4 శాతం పెరిగి 9.33 లక్షల యూనిట్లుగా నమోదైంది. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, సరఫరా వ్యవస్థలో ఏర్పడిన అంతరాయాలు వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయని కంపెనీ తెలిపింది. ఈ కారణంగానే అమ్మకాల గణాంకాలు బలహీనంగా ఉన్నట్లు వెల్లడించింది.

వివరాలు

నిరాశ పరిచిన అమ్మకాలు..

ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులపై భారీ ప్రభావం పడింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ప్రాంతానికి టయోటా ఎగుమతులు 92 శాతం వరకు పడిపోయి కేవలం 2,418 వాహనాలకు మాత్రమే పరిమితమయ్యాయి. ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడంతో సరుకుల రవాణా, సరఫరాలో ఇబ్బందులు తలెత్తినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇదే పరిస్థితి ఇంకా కొనసాగితే వ్యాపారంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని కంపెనీ అంగీకరించింది. చైనాలో కూడా టయోటా అమ్మకాలు నిరాశపరిచాయి. అక్కడ ఏప్రిల్ నెలలో విక్రయాలు దాదాపు 25 శాతం తగ్గినట్లు సమాచారం.

వివరాలు

టయోటా లాభాలు, ఉత్పత్తిపై ఆందోళనలు..

మరోవైపు హోండా మోటార్ గ్లోబల్ అమ్మకాలు 7.9 శాతం తగ్గి 2.65 లక్షల యూనిట్లకు చేరింది. నిస్సాన్ మోటార్స్ విక్రయాలు 7.6 శాతం పడిపోయి 2.08 లక్షల వాహనాలుగా నమోదయ్యాయి. దీంతో జపాన్‌కు చెందిన ప్రధాన ఆటో కంపెనీలు ప్రస్తుతం పలు కీలక మార్కెట్లలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు స్పష్టమవుతోంది. టయోటా లాభాలు, ఉత్పత్తిపై కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి.

Advertisement

వివరాలు

తదుపరి వ్యూహాలపై దృష్టి..

2027 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరానికి లాభాలు తగ్గే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేసింది. ఆపరేటింగ్ ఆదాయం 3 లక్షల కోట్ల యెన్‌లు (సుమారు రూ.1.80 లక్షల కోట్లు)గా ఉండొచ్చని తెలిపింది. గత ఏడాది ఇది 3.8 లక్షల కోట్ల యెన్‌లుగా నమోదైంది. విదేశీ ఉత్పత్తిలో దాదాపు 83 వేల యూనిట్ల వరకు కోత పడే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులను టయోటా నిశితంగా గమనిస్తూ, తదుపరి వ్యూహాలపై దృష్టి పెట్టింది.

Advertisement