Page Loader
Number Plates: పాత వాహనదారులకు కేంద్రం హెచ్చరిక.. హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు
హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు

Number Plates: పాత వాహనదారులకు కేంద్రం హెచ్చరిక.. హైసెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్డెక్కితే కేసులు నమోదు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2025
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

2019 ఏప్రిల్ 1కు ముందు తయారైన వాహనాల యజమానులందరికీ కేంద్ర రవాణా శాఖ తాజా ఉత్తర్వుల మేరకు హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (HSRP) ఏర్పాటు చేయడం తప్పనిసరి అయ్యింది. ఈ నిబంధన అన్ని రకాల వాహనాలకు వర్తించనుండగా, గడువు తేదీగా 2025 సెప్టెంబర్ 30ని నిర్దేశించారు. ఆ తేదీ లోపు హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమర్చని వాహనాలపై జరిమానాలు విధిస్తారు. బుధవారం విడుదలైన గెజిట్ నోటిఫికేషన్‌తో ఈ మార్గదర్శకాలు అధికారికంగా అమలులోకి వచ్చాయి. ఈ కొత్త చర్యల ప్రధాన ఉద్దేశాలు రోడ్డు భద్రతను మెరుగుపరచడం, నకిలీ నంబర్ ప్లేట్లను నియంత్రించడం, వాహన చోరీలను అడ్డుకోవడం. అంతేకాకుండా, ఇది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఒకటి.

వివరాలు 

బాధ్యత వాహన యజమానిదే!  

పాత వాహన యజమానులందరూ తమ వాహనాలకు హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమర్చుకోవాలి. లేకపోతే వాహన అమ్మకం, కొనుగోలు, రిజిస్ట్రేషన్ ట్రాన్స్‌ఫర్, బీమా తీసుకోవడం, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (PUC) సర్టిఫికెట్ పొందడం వంటి సేవలు అందుబాటులో ఉండవు. సెప్టెంబర్ 30 తర్వాత హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేని వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. రవాణా శాఖ ప్రకారం, హెచ్‌ఎస్‌ఆర్‌పీ లేకుండా రోడ్లపై తిరిగే వాహనాలపై కేసులు నమోదు చేస్తారు. వాహన తయారీ సంస్థలు తమ డీలర్ల ద్వారా HSRP అమర్చే సౌకర్యం కల్పించాలి. అలాగే, ప్లేట్ అమరికకు గాను వసూలు అయ్యే రుసుములను స్పష్టంగా ప్రదర్శించాలి. ఇంటికే నంబర్ ప్లేట్ అందించే సేవను కోరితే, అదనంగా సేవా రుసుము వసూలు చేయవచ్చు.

వివరాలు 

దరఖాస్తు విధానం 

వాహనదారులు www.siam.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అక్కడ వాహన వివరాలను నమోదు చేసి, సమీప హెచ్‌ఎస్‌ఆర్‌పీ అమరిక కేంద్రంలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. నంబర్ ప్లేట్ అమర్చిన తర్వాత దాని ఫోటోను అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మాత్రమే వాహనం లీగల్‌గా రోడ్డుపై ప్రయాణించగలదు. రుసుముల వివరాలు: వాహన రకం ప్రకారం హెచ్‌ఎస్‌ఆర్‌పీ ధరలు: ద్విచక్ర వాహనాలు: రూ.320 - రూ.380 ఇంపోర్టెడ్ బైక్స్: రూ.400 - రూ.500 కార్లు: రూ.590 - రూ.700 ఇంపోర్టెడ్ కార్లు: రూ.700 - రూ.860 త్రీ వీలర్స్: రూ.350 - రూ.450 కమర్షియల్ వాహనాలు: రూ.600 - రూ.800 ఈ ధరలకే అధికారికంగా అనుమతి పొందిన ప్లేట్ ఫిట్మెంట్ అందుతుంది.

వివరాలు 

ఆలస్యం చెయ్యొద్దు! 

వాహన భద్రత, చట్టబద్ధత, జరిమానాల నివారణ ఇలా అనేక అంశాల్లో హెచ్‌ఎస్‌ఆర్‌పీ మీకు ఉపయోగపడుతుంది. గడువులోపు ఈ ప్లేట్‌ను అమర్చడం వాహన యజమానుల బాధ్యత. ఇది మీ వ్యక్తిగత భద్రతకు మేలు చేసే జాగ్రత్త కూడా. ఆలస్యం చేయకుండా వెంటనే చర్య తీసుకోండి!