Tesla: డ్రైవర్ లేకుండానే ప్రయాణం.. డల్లాస్, హ్యూస్టన్‌లో టెస్లా సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా తన రోబోటాక్సీ సేవలను మరింత విస్తరిస్తోంది. తాజాగా ఈ సేవలను టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్, హ్యూస్టన్ నగరాలకు విస్తరించినట్లు కంపెనీ ప్రకటించింది. డల్లాస్ & హ్యూస్టన్‌లో రోబోటాక్సీ సేవలు ప్రారంభమవుతున్నాయంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియోలో డ్రైవర్ లేకుండా, ముందు సీట్లో సేఫ్టీ మానిటర్ లేకుండానే టెస్లా కార్లు స్వయంచాలకంగా ప్రయాణిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
వివరాలు
మూడు నగరాల్లో టెక్సాస్ సేవలు
డల్లాస్, హ్యూస్టన్ చేరడంతో టెక్సాస్‌లో మొత్తం మూడు నగరాల్లో టెస్లా రోబోటాక్సీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. గతేడాది ఆస్టిన్‌లో ఈ సేవలను ప్రారంభించిన కంపెనీ, 2026 జనవరి నుంచి సేఫ్టీ డ్రైవర్లు లేకుండానే రైడ్స్ అందిస్తోంది. అయితే, ఆస్టిన్‌లో ప్రారంభమైనప్పటి నుంచి టెస్లా రోబోటాక్సీలు మొత్తం 14 ప్రమాదాల్లో చిక్కుకున్నాయని కంపెనీ ఫిబ్రవరిలో దాఖలు చేసిన నివేదికలో వెల్లడించింది.
వివరాలు
కొత్త నగరాల్లో పరిమిత సేవలు
ఇక కొత్తగా సేవలు ప్రారంభించిన డల్లాస్, హ్యూస్టన్ నగరాల్లో ప్రస్తుతం వాహనాల సంఖ్య చాలా పరిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. 'రోబోటాక్సీ ట్రాకర్' అనే క్రౌడ్‌సోర్స్ డేటా ప్రకారం, ఈ రెండు నగరాల్లో ఒక్కో వాహనం మాత్రమే ప్రస్తుతం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అదే సమయంలో ఆస్టిన్‌లో 46 రోబోటాక్సీలు సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఇక సాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో టెస్లా మరింత నియంత్రిత రైడ్ సేవలను అందిస్తోంది. అక్కడ మాత్రం మానవ డ్రైవర్లతోనే వాహనాలను నడుపుతోంది. కొత్త మార్కెట్లలో విస్తరణ కొనసాగుతున్నప్పటికీ, సేవల పరిమాణం ఇప్పటికీ పరిమితంగానే ఉన్నట్లు తెలుస్తోంది.