Working Hours: ఉద్యోగంలో 12 గంటలు?.. వారానికి 70 లేదా 90 గంటల పెంపుపై కేంద్రం..ఏమందంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్తలు ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారారు.
వీరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారి,తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు.
ముందుగా నారాయణ మూర్తి మాట్లాడుతూ, భారత యువత వారానికి 70 గంటలు పని చేయాలని సూచించారు.
అలా చేస్తేనే భారతదేశం చైనా, జపాన్, అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదే తరుణంలో ఎల్ అండ్ టీ ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ మరింత ముందుకెళ్లి, ఉద్యోగులు ఆదివారాలూ సహా వారానికి 90 గంటలకు పైగా పనిచేయాలని చెప్పడం ఆశ్చర్యం వేసింది.
వివరాలు
కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
నారాయణ మూర్తి వ్యాఖ్యలను కొందరు వ్యాపార ప్రముఖులు, స్టార్టప్ కంపెనీల అధిపతులు సమర్థించినప్పటికీ, సాధారణ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఇక ఎల్ అండ్ టీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆగ్రహానికి దారి తీశాయి.
ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ సంస్థల అధినేతలు అధిక పని గంటలను ప్రోత్సహిస్తున్న విధానం యువతలో ఆందోళన రేకెత్తించింది.
వాస్తవంగా వారానికి 70-90 గంటల పాటు పనిచేయాల్సి వస్తుందేమోనన్న భయం పెరిగింది.
అయితే ఈ విషయంపై తాజాగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
పని గంటలను పెంచే ప్రతిపాదన తమ ముందుకురాలేదని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర కార్మిక,ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
వివరాలు
CIRM తనిఖీ అధికారుల ద్వారా పర్యవేక్షణ
"కార్మిక హక్కులు ఉమ్మడి జాబితాలో ఉంటాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలో కార్మిక చట్టాలను అమలు చేస్తాయి. కేంద్ర పరిశ్రమ సంబంధాల యంత్రాంగం (CIRM) తనిఖీ అధికారుల ద్వారా పర్యవేక్షణ చేస్తుంది, ఇక రాష్ట్రాలు తమ విభాగాల ద్వారా ఈ నియమాలను అమలు చేస్తాయి" అని శోభా కరంద్లాజే పేర్కొన్నారు.
అలాగే, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్‌ల ద్వారా పని గంటలు, ఓవర్‌టైమ్, ఉద్యోగ పరిస్థితులను నియంత్రిస్తారని ఆమె వివరించారు.
వివరాలు
12 గంటలకుపైగా పని చేసే వ్యక్తులు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం
ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు ముందు లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025లో కూడా పని గంటల ప్రస్తావన వచ్చింది.
వారంలో 60 గంటలకు మించి పని చేయడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీని వల్ల మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది.
ముఖ్యంగా రోజూ 12 గంటలకుపైగా పని చేసే వ్యక్తులు తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉన్నట్లు వివిధ పరిశోధనల ఆధారంగా వివరించింది.