LOADING...
CDSCO: సీడీఎస్‌సీఓ నివేదిక.. నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు 
సీడీఎస్‌సీఓ నివేదిక.. నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు

CDSCO: సీడీఎస్‌సీఓ నివేదిక.. నాణ్యత పరీక్షలలో విఫలమైన 135 రకాల మందులు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
10:52 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఔషధ ప్రమాణ నియంత్రణ సంస్థ డిసెంబర్ నెలలో సేకరించిన మందుల నమూనాలపై నిర్వహించిన పరీక్షల ఫలితాలను ఇటీవల విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం మొత్తం 135 మందులు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయినట్లు గుర్తించారు. ఈ మందుల్లో గుండె, షుగర్, కిడ్నీ, రక్తపోటు, యాంటీబయాటిక్స్ వంటి వివిధ వ్యాధులకు ఉపయోగించే ఔషధాలున్నాయి. కొన్ని నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నందున, మందుల తయారీ కంపెనీలపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా పేర్కొన్నారు.

Details

లైసన్సు రద్దు చేసే అవకాశం

నాణ్యతా ప్రమాణాలను అందుకోలేకపోయిన మందుల్లో ప్రధానంగా షుగర్, మైగ్రేన్ వంటి వ్యాధులకు ఉపయోగించే ఔషధాలున్నాయి. కేంద్ర ప్రయోగశాలలు 51 మందుల నమూనాలను, రాష్ట్ర ఔషధ పరీక్షా ప్రయోగశాలలు 84 మందుల నమూనాలను పరీక్షించి, ఇవి నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని నిర్ధారించాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, కొన్ని మందుల తయారీదారుల లైసెన్స్‌లను రద్దు చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. తక్కువ నాణ్యత గల మందుల్లో జన్ ఔషధ కేంద్రాలకు సరఫరా చేసే కొన్ని ముఖ్యమైన ఔషధాలు ఉన్నాయి. వీటిలో యాంటీబయాటిక్ సెఫ్పోడోక్సైమ్ టాబ్లెట్ (200 మిల్లీగ్రామ్స్), డైవల్‌ప్రోఎక్స్ ఎక్స్టెండెడ్ రిలీజ్ టాబ్లెట్, మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ టాబ్లెట్, జింక్ సల్ఫేట్ టాబ్లెట్, పెంటాప్రజోల్, అమోక్సిసిలిన్, బీటాహిస్టైన్ ప్రధానంగా ఉన్నాయి.

Details

వివిధ దశల్లో పరీక్షలు

ఇప్పటివరకు నాణ్యతా ప్రమాణాలను అందుకోలేని 300 మందులను నిషేధించారు. వాటిలో 206 మందులు ఫిక్స్‌డ్ డోస్ కలిగి ఉన్నాయి. ఫిక్స్‌డ్ డోస్ అనగా, ఒకే మందులో రెండు లేదా ఎక్కువ మందులను కలిపి తయారు చేయడం. మందుల నాణ్యత నిర్ధారించడానికి CDSCO వివిధ దశల్లో పరీక్షలు నిర్వహిస్తుంది. మొదట, మందుల డాక్యుమెంట్లు, లేబెలింగ్, ఎక్స్‌పైరీ డేట్లను పరిశీలిస్తారు. తర్వాత మందుల భద్రత, ప్రభావాలను అంచనా వేసేందుకు ప్రత్యేకమైన సేఫ్టీ పరీక్షలు చేస్తారు. లేబెలింగ్ విషయంలో ఎటువంటి తప్పులు ఉన్నా, అవి సరిదిద్దే చర్యలు తీసుకుంటారు.