8th Pay Commission:8వ వేతన సంఘం వినతుల గడువు మళ్లీ పెంపు:.. జీతాల పెంపు ఎప్పటి నుంచి అంటే?
ఈ వార్తాకథనం ఏంటి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) మరో కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ ఉద్యోగ సంఘాలు, కార్మిక యూనియన్లు, పెన్షనర్ల సంస్థలు తమ డిమాండ్లు, సూచనలను సమర్పించేందుకు మరింత సమయం కల్పిస్తూ వినతుల సమర్పణ గడువును మరోసారి పొడిగించింది. తుది నివేదిక రూపకల్పనలో భాగంగా కమిషన్ ఇచ్చిన రెండో పొడిగింపు ఇదే.
వివరాలు
జూన్ 15 వరకు అవకాశం
8వవేతన సంఘం తాజా సర్క్యులర్ ప్రకారం మెమోరాండం సమర్పణకు చివరి తేదీగా 2026 జూన్ 15ను నిర్ణయించింది. ఈ ప్రక్రియ 2026 మార్చి 5న ప్రారంభమైంది. మొదట ఏప్రిల్ 30వరకు గడువు ఇచ్చిన కమిషన్, అనంతరం దానిని మే 31 వరకు పొడిగించింది. తాజాగా మరోసారి గడువు పెంచుతూ జూన్ 15వరకు అవకాశం కల్పించింది. అయితే ఇది తుది పొడిగింపేనని కమిషన్ స్పష్టం చేసింది.జూన్ 15 తర్వాత ఎలాంటి గడువు పెంపు ఉండదని వెల్లడించింది. ఆన్‌లైన్ ద్వారానే వినతులు ఉద్యోగ సంఘాలు,పెన్షనర్ల సంస్థలు తమ వినతులను తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్ 8cpc.gov.in ద్వారా మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది. హార్డ్ కాపీలు,ఈమెయిల్‌లు లేదా పీడీఎఫ్ రూపంలో పంపే వినతులను కమిషన్ పరిగణనలోకి తీసుకోబోదని స్పష్టంచేసింది.
వివరాలు
కొత్త జీతాలు ఎప్పటి నుంచి?
కేంద్ర ప్రభుత్వం 2025 అక్టోబర్‌లో 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం నవంబర్‌లో అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. కమిషన్ తన నివేదిక సమర్పించేందుకు 18 నెలల గడువు కల్పించారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సవరించిన వేతనాలు 2027 ఏప్రిల్ లేదా మే నెలల నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
2027 ఏప్రిల్ నుంచే అమలు కావొచ్చా?
ఆలిండియా ఎన్‌పీఎస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, నేషనల్ మిషన్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ భారత్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంజీత్ సింగ్ పటేల్ గతంలో చేసిన వ్యాఖ్యల్లో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే ఏప్రిల్ నెల అమలుకు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఒకటి లేదా రెండు నెలలు ఆలస్యం జరిగినా, 2027 ఏప్రిల్ నాటికి కొత్త వేతనాలు అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
వివరాలు
బకాయిల భారం పెరగనుందా?
వేతన సవరణ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు, ప్రభుత్వం రెండింటిపైనా ఆర్థిక ప్రభావం పడే అవకాశం ఉంది. వాస్తవానికి కొత్త వేతన నిర్మాణం 2026 జనవరి 1 నుంచే అమలులోకి రావాల్సి ఉంది. అయితే అమలు ఆలస్యం కావడంతో ఆ తేదీ నుంచి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. కొత్త వేతన స్కేళ్లు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ బకాయిలన్నింటినీ ప్రభుత్వం ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.
వివరాలు
హెచ్‌ఆర్‌ఏ విషయంలో నష్టం?
బేసిక్ పేకు సంబంధించిన బకాయిలను గత తేదీ నుంచి లెక్కించి ఉద్యోగులకు చెల్లించే అవకాశం ఉన్నప్పటికీ,హెచ్‌ఆర్‌ఏ విషయంలో పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. సాధారణంగా హెచ్‌ఆర్‌ఏను వెనుకటి తేదీల నుంచి చెల్లించే విధానం ఉండదు. దీంతో వేతన సవరణ అమలులో ఆలస్యం అయిన కాలానికి సంబంధించి పెరిగిన హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనాలను ఉద్యోగులు కోల్పోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
కమిషన్‌లో ఎవరున్నారు?
8వ వేతన సంఘానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ అధ్యక్షత వహిస్తున్నారు. మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తుండగా, ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడు, ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ పులక్ ఘోష్ సభ్యుడిగా ఉన్నారు. 2025 నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కమిషన్ ద్వారా తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,రక్షణ శాఖ సిబ్బంది, అలాగే 65 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపనున్నాయి. వీరందరూ 8వ వేతన సంఘం సిఫార్సుల ద్వారా లబ్ధి పొందనున్నారు.