8th Pay Commission: రైల్వే సంఘం కొత్త ప్రతిపాదన.. కొన్ని వర్గాల జీతాలు నాలుగు రెట్లు పెరిగే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పదవీ విరమణ చేసిన ఉద్యోగుల భవిష్యత్తును ప్రభావితం చేసే 8వ వేతన సంఘంపై చర్చలు వేగం పుంజుకున్నాయి. ప్రతి పదేళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే ఆనవాయితీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2025 నవంబర్ 3న 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం అందరికీ ఒకే విధమైన జీతాల పెంపు కాకుండా, ఉద్యోగుల హోదాను బట్టి వేర్వేరు విధానాలు అమలు చేయాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. రైల్వే సాంకేతిక పర్యవేక్షకుల సంఘం కొత్త విధానాన్ని కేంద్రం ముందుంచింది. ఇప్పటివరకు వేతన సంఘాల్లో అందరికీ ఒకే రకమైన మల్టిప్లయర్ (Multiplier) వర్తింపజేసి జీతాలు నిర్ణయించేవారు.
వివరాలు
2.92 నుంచి 4.38 వరకు ఐదు రకాల మల్టిప్లయర్లు
కానీ ఈసారి ఉద్యోగ స్థాయిలను ఆధారంగా తీసుకుని వేర్వేరు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్లను అమలు చేయాలని ప్రతిపాదించారు. ఈ విధానం అమలైతే తక్కువ స్థాయి ఉద్యోగులతో పోలిస్తే ఉన్నత స్థాయి అధికారుల జీతాల్లో భారీ పెరుగుదల కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం 2.92 నుంచి 4.38 వరకు ఐదు రకాల మల్టిప్లయర్లను సూచించారు. ముఖ్యంగా ఉన్నత స్థాయి అధికారుల వేతనాలు ప్రస్తుతం ఉన్న వాటికంటే నాలుగు రెట్లు వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వేతనాల లెక్కింపులో ఉపయోగించే మల్టిప్లయర్నే 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్'గా పిలుస్తారు. పాత ప్రాథమిక వేతనాన్ని కొత్త వేతన నిర్మాణంలోకి మార్చేందుకు దీనిని ఉపయోగిస్తారు.
వివరాలు
కొత్త వేతనాన్ని లెక్కించే విధానం ఇలా ఉంటుంది..
దీని ప్రభావం కేవలం ప్రాథమిక జీతంపైనే కాకుండా, పదవీ విరమణ భత్యాలు, ఇతర భత్యాలపైనా ఉంటుంది. కొత్త వేతనాన్ని లెక్కించే విధానం ఇలా ఉంటుంది.. ప్రస్తుత ప్రాథమిక వేతనం × ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ = కొత్త ప్రాథమిక వేతనం రైల్వే సంఘం ప్రతిపాదించిన అంచనాల ప్రకారం మొదటి నుంచి ఐదో స్థాయి ఉద్యోగి ప్రస్తుతం రూ.20 వేల ప్రాథమిక వేతనం పొందుతున్నట్లయితే, 2.92 మల్టిప్లయర్ ప్రకారం అది రూ.58,400కు చేరవచ్చు. ఆరవ నుంచి ఎనిమిదో స్థాయి ఉద్యోగుల వేతనం రూ.45 వేల నుంచి రూ.1.57 లక్షలకు పెరిగే అవకాశం ఉంది.
వివరాలు
1.1 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు లాభం
అలాగే తొమ్మిదో నుంచి పన్నెండో స్థాయి ఉద్యోగుల వేతనం రూ.80 వేల నుంచి రూ.3.04 లక్షలకు చేరవచ్చని అంచనా. పదమూడో నుంచి పదహారో స్థాయి అధికారుల ప్రాథమిక వేతనం రూ.1.20 లక్షల నుంచి రూ.4.90 లక్షలకు పెరగవచ్చు. అత్యున్నత స్థాయిలో ఉన్న 17, 18 స్థాయి అధికారుల వేతనం రూ.2.50 లక్షల నుంచి దాదాపు రూ.10.95 లక్షలకు చేరే అవకాశం ఉందని ప్రతిపాదనలు సూచిస్తున్నాయి. ఈ ప్రతిపాదనలు అమలైతే దేశవ్యాప్తంగా సుమారు 1.1 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు లాభపడనున్నారు.
వివరాలు
ఇప్పటివరకు ఏడు వేతన సంఘాలు
1946లో తొలి వేతన సంఘం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు వేతన సంఘాలు అమలులోకి వచ్చాయి. గత రెండు వేతన సంఘాల్లో అమలైన ఒకే మల్టిప్లయర్ విధానానికి భిన్నంగా, ఈసారి ప్రతిపాదించిన బహుళ మల్టిప్లయర్ల విధానం ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అయితే ఈ ప్రతిపాదనలు అమలైతే కేంద్ర ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉండటంతో, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తిగా మారింది.