Petrol-Diesel Prices: వాహనదారులకు భారీ షాక్?.. ఈరోజే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్!
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశాలపై చర్చ జోరుగా సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో ఇంధన ధరల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చకు మరింత బలం చేకూర్చాయి. ఇంధనం, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ప్రధాని.. ప్రజలు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
వివరాలు
కార్ పూలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి
ప్రజా రవాణా వ్యవస్థలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని, కార్ పూలింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్‌లైన్ మీటింగ్‌లు నిర్వహించడం, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడం, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సేవలను ఎక్కువగా వినియోగించడం అవసరమని తెలిపారు. ప్రధాని వ్యాఖ్యల అనంతరం దేశంలో ఇంధన ధరల పెంపు తప్పదనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై ప్రభావం పడుతోంది. దీంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
వివరాలు
భారీగా పెరిగిన ముడి చమురు ధరలు
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ఈ త్రైమాసికంలో అండర్ రికవరీలు రూ.2 లక్షల కోట్ల వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అందులో సుమారు రూ.1 లక్ష కోట్ల నష్టం వచ్చే అవకాశముందని వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పదనే అభిప్రాయానికి కేంద్రం వచ్చినట్లు సమాచారం. సోమవారం సాయంత్రానికల్లా ఇంధన ధరలపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖ, పెట్రోలియం శాఖ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల మధ్య చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
వివరాలు
ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుంది
ఇంధన ధరల పెంపు స్థాయి అంతర్జాతీయ ముడి చమురు ధరల మార్పులు, ద్రవ్యోల్బణ పరిస్థితులు, ఆర్థిక ఒత్తిడులు, ప్రభుత్వ విధానాలపై ఆధారపడి ఉంటుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర పెట్రోలియం మరియు సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ముడి చమురు, గ్యాస్, ఎల్‌పీజీని అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నప్పటికీ, వినియోగదారులకు తక్కువ ధరలకు విక్రయిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల ఆయిల్ కంపెనీలకు రోజుకు సుమారు రూ.1,000కోట్ల వరకు నష్టం వస్తోందని వెల్లడించారు. ఈ పెరుగుతున్న నష్టాలను తగ్గించేందుకు ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచే అవకాశాలు ఉన్నాయని అధికారిక వర్గాలు సూచిస్తున్నాయి.