LOADING...
BSNL capex: బీఎస్‌ఎన్‌ఎల్‌ విస్తరణకు భారీ ఊతం… మరో రూ.47 వేల కోట్లు మంజూరు!
బీఎస్‌ఎన్‌ఎల్‌ విస్తరణకు భారీ ఊతం… మరో రూ.47 వేల కోట్లు మంజూరు!

BSNL capex: బీఎస్‌ఎన్‌ఎల్‌ విస్తరణకు భారీ ఊతం… మరో రూ.47 వేల కోట్లు మంజూరు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 14, 2025
02:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) నెట్‌వర్క్‌ విస్తరణకు కేంద్రం మరో పెద్ద అడుగు వేసింది. ఈ సంవత్సరం సంస్థకు రూ.47 వేల కోట్లు మూలధన వ్యయంగా కేటాయించనుంది. ఈ విషయం గురువారం టెలికాం విభాగం (DoT) ఎక్స్‌లో వెల్లడించింది. గతేడాది 4జీ మొబైల్‌ సేవల కోసం లక్ష టవర్ల ఏర్పాటు ఖర్చు రూ.25 వేల కోట్లుగా ఉండగా, ఈసారి ఆ మొత్తాన్ని దాదాపు రెట్టింపు చేసింది. ఎన్నడూ లేని రీతిలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేసినట్టు కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.47 వేల కోట్లకు పెంచుతున్నట్టు ప్రకటించారు.

Details

ఫ్రీడమ్‌ ఆఫర్‌ పేరుతో 1 రూపాయికే అపరిమిత కాల్స్‌

ఇటీవల బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్కిల్‌, బిజినెస్‌ యూనిట్‌ అధిపతులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, వచ్చే ఏడాదిలోగా మొబైల్‌ వ్యాపారాన్ని 50 శాతం, ఎంటర్‌ప్రైజ్‌ వ్యాపారాన్ని 25-30 శాతం, ఫిక్స్‌డ్‌ లైన్‌ వ్యాపారాన్ని 15-20 శాతం వృద్ధి సాధించేలా లక్ష్యాలను నిర్ధేశించారు. అలాగే చందాదారుల నమ్మకాన్ని పెంచుతూ, వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయాన్ని (ARPU) పెంచాలని సూచించారు. ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ ARPU సర్కిల్‌ వారీగా రూ.40 నుంచి రూ.175 మధ్య ఉంది. పోలిస్తే, రిలయన్స్‌ జియో రూ.208, ఎయిర్‌టెల్‌ రూ.250 సగటు ఆదాయం పొందుతున్నాయి. ఈ క్రమంలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవల "ఫ్రీడమ్‌ ఆఫర్‌" పేరుతో కేవలం 1 రూపాయికే అపరిమిత కాల్స్‌ సదుపాయాన్ని ప్రకటించినట్లు సమాచారం.