Netflix: స్ట్రీమింగ్ ప్రపంచంలో సంచలనం… వార్నర్ బ్రదర్స్ డిస్కవరీని కొనుగోలు చేసిన నెట్‌ఫ్లిక్స్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ వినోద రంగంలో మరో భారీ ఒప్పందం కుదిరింది. వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకు చెందిన టీవీ, సినిమా స్టూడియోలు, స్ట్రీమింగ్ విభాగాన్ని కొనుగోలు చేయడానికి స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ డీల్‌ను ప్రకటించింది. ఈ కొనుగోలు విలువ 72 బిలియన్ డాలర్లు(దాదాపు ₹6.48 లక్షల కోట్లు)గా నిర్ణయించినట్లు వెల్లడైంది. ఒప్పంద నిబంధనల ప్రకారం, ఒక్కో వార్నర్ బ్రదర్స్ షేరుకు నెట్ ఫ్లిక్స్ 28 డాలర్లు చెల్లించనుంది. ఇది గురువారం షేరు ముగింపు ధర అయిన 24.54 డాలర్లు కంటే, అలాగే గతంలో పారామౌంట్ సంస్థ చేసిన 24 డాలర్ల బిడ్ కంటే ఎక్కువ. ప్రస్తుత ముగింపు ధర ఆధారంగా వార్నర్ బ్రదర్స్ మార్కెట్ విలువ 61 బిలియన్ డాలర్లు(సుమారు ₹5.49 లక్షల కోట్లు).
Details
ప్రముఖ ఫ్రాంఛైజీలు నెట్‌ఫ్లిక్స్ అధీనంలోకి
ఈ డీల్‌తో గేమ్ ఆఫ్ థ్రోన్స్, డీసీ కామిక్స్, హ్యారీ పోటర్, ఫ్రెండ్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఫ్రాంఛైజీలన్నీ నెట్‌ఫ్లిక్స్ లైబ్రరీలో చేరనున్నాయి. దీంతో హాలీవుడ్‌లో అత్యంత విలువైన కంటెంట్ కలెక్షన్ కలిగిన సంస్థగా నెట్‌ఫ్లిక్స్ మరింత బలోపేతం కానుంది. అంతేకాదు, హెచ్‌బీఓ నెట్‌వర్క్స్‌కు కూడా నెట్‌ఫ్లిక్స్ కొత్త యజమానిగా మారుతుంది.
Details
ఒప్పందానికి అడ్డంకులా?
అయితే ఈ భారీ కొనుగోలు ఒప్పందం యాంటీ-ట్రస్ట్ విచారణలకు లోనయ్యే అవకాశముంది. ముఖ్యంగా ఐరోపా, అమెరికా నియంత్రణ సంస్థలు ఈ డీల్‌ను కఠినంగా పరిశీలించే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇటీవల పారామౌంట్ సంస్థ, ట్రంప్ ప్రభుత్వంతో ఉన్న అనుబంధం కారణంగా, ఈ కొనుగోలు ప్రక్రియను ప్రశ్నిస్తూ నెట్‌ఫ్లిక్స్‌కు అనుకూలంగా వ్యవహరించారని ఆరోపించింది. అంతకుముందు అక్టోబరులో పారామౌంట్ చేసిన 60 బిలియన్ డాలర్ల (సుమారు ₹5.40 లక్షల కోట్లు) బిడ్‌ను వార్నర్ బ్రదర్స్ బోర్డు తిరస్కరించడం ఈ వివాదానికి నేపథ్యంగా నిలిచింది. ఒకవేళ నియంత్రణ సంస్థలు ఈ ఒప్పందాన్ని అడ్డుకుంటే, బ్రేకప్ ఫీజు కింద 5 బిలియన్ డాలర్లు(సుమారు 45,000 కోట్లు)చెల్లించేందుకు నెట్‌ఫ్లిక్స్ ముందుగా ఒప్పందంలో స్పష్టం చేసినట్లు సమాచారం.