LOADING...
Aadhaar mobile number: ఇంటి వద్దే ఆధార్‌ మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌.. త్వరలో కొత్త సౌకర్యం 
ఇంటి వద్దే ఆధార్‌ మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌.. త్వరలో కొత్త సౌకర్యం

Aadhaar mobile number: ఇంటి వద్దే ఆధార్‌ మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌.. త్వరలో కొత్త సౌకర్యం 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2025
04:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌ సేవలను మరింత సులభతరం చేసే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. ఇకపై ఆధార్‌కు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ను అప్‌డేట్‌ చేయడానికి కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే సులభంగా మార్చుకునే వీలును కల్పించే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ఉడాయ్‌ తన ఎక్స్‌ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించింది. ప్రస్తుతం మొబైల్‌ నంబర్‌ అప్‌డేట్‌ కోసం తప్పనిసరిగా వ్యక్తిగతంగా ఆధార్‌ కేంద్రానికే వెళ్లాలి. చిన్న మార్పు కోసం కూడా క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.

Details

ప్రత్యేక టెక్నాలజీ అభివృద్ధి

ఈ సమస్యలను అధిగమించేందుకు, మొబైల్‌ అప్‌డేషన్‌ను పూర్తిగా డిజిటల్‌ విధానంలో అందించేలా ఉడాయ్‌ ప్రత్యేక టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది. ఓటీపీ, ఆధార్‌ ఫేస్‌ అథెంటికేషన్‌ను కలిపిన ఈ కొత్త టెక్నాలజీలో, ముందుగా మొబైల్‌కు పంపిన ఓటీపీని నమోదు చేయాలి. అనంతరం మొబైల్‌ కెమెరా ద్వారా ముఖాన్ని స్కాన్‌ చేసి ధృవీకరించే ప్రక్రియ పూర్తిచేయాలి. ఇలా ఓటీపీ+ముఖ గుర్తింపుతో మొబైల్‌ నంబర్‌ అప్‌డేషన్‌ సులభంగా పూర్తి చేయవచ్చని ఉడాయ్‌ తెలిపింది. త్వరలోనే ఈ సౌకర్యం దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నట్లు వెల్లడిస్తూ, ఇందుకు సంబంధించి తాజాగా విడుదల చేసిన కొత్త ఆధార్‌ యాప్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పొందిన వినియోగదారులు తమ ఫీడ్‌బ్యాక్‌ను పంచుకోవాలని కూడా కోరింది

Advertisement