Aadhaar mobile number: క్యూలకు గుడ్‌బై.. ఇక ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ వినియోగదారులకు మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఆధార్‌కార్డులో మొబైల్ నంబర్‌ను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా అప్‌డేట్ చేసుకునే వీలు కల్పించింది. ఉడాయ్ డే సందర్భంగా ఈ కొత్త సేవను ప్రకటించిన UIDAI, జనవరి 28 నుంచి ఇది అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో ఆధార్‌కు సంబంధించిన సేవలు మరింత సులభతరం అవుతాయని తెలిపింది. బ్యాంకింగ్ లావాదేవీలు, సబ్సిడీలు, అలాగే అనేక ఆన్‌లైన్ ప్రభుత్వ సేవలు పొందాలంటే ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ చేసి ఉండటం అత్యవసరం.
వివరాలు
మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి, వృద్ధులు, దివ్యాంగులకు ఉపయోగకరం
అయితే ఇప్పటివరకు మొబైల్ నంబర్ మార్పు కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో వినియోగదారులు గంటల తరబడి క్యూలలో నిలబడి ఇబ్బందులు పడేవారు. ఈ సమస్యలకు పరిష్కారంగా తీసుకొచ్చిన ఈ కొత్త సౌకర్యంతో ఆ అసౌకర్యాలు తొలగిపోతాయని UIDAI భావిస్తోంది. ఇకపై ఆధార్ వినియోగదారులు తమ మొబైల్ నంబర్‌ను సులభంగా, తమకు అనుకూలమైన సమయంలో, ఎక్కడి నుంచైనా అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అలాగే మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా మారనుంది.