
Accenture promotions: యాక్సెంచర్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్: 50 వేలమందికి ప్రమోషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఐటీ సేవల సంస్థ అయిన యాక్సెంచర్ (Accenture) తమ ఉద్యోగులకు శుభవార్తను తెలియజేసింది.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారు 50 వేలమంది ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వబోతున్నట్లు సంస్థ ప్రకటించింది.
ఇందులో భారత్‌లో పనిచేస్తున్న 15 వేల మంది ఉద్యోగులు కూడా ఉండటం విశేషం.
ఇప్పటికే కన్సల్టింగ్ సేవలపై డిమాండ్ తగ్గుదల కారణంగా ప్రమోషన్ల ప్రక్రియను సంస్థ అరుసేళ్ల పాటు వాయిదా వేసింది.
అయితే, ఉద్యోగుల్లో నమ్మకాన్ని పెంపొందించడానికి జూన్‌లో ప్రమోషన్లు కల్పించేందుకు యాక్సెంచర్ సిద్ధమవుతోంది.
ఈ మేరకు ఇంటర్నల్ మెమోలు సిబ్బందికి పంపిస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్ అనే అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.
వివరాలు
ప్రమోషన్లను ఎలా విభజించనున్నదంటే..
భారత్‌లో 15 వేలమందికి, యూరప్‌లో 11 వేలమందికి, పశ్చిమ ఆసియా, ఆఫ్రికా కలిపి మరో 11 వేల మందికి, అలాగే అమెరికాలో 10 వేలమందికి ఈ ఉద్యోగోన్నతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం యాక్సెంచర్‌లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అందులో జూన్‌లో మొత్తం సిబ్బందిలో సుమారు 6 శాతం మంది ప్రమోషన్ పొందనున్నారు.
అసలు ఈ ప్రక్రియ గతేడాది డిసెంబర్‌లో జరగాల్సి ఉండగా ఆలస్యమైంది.
ప్రమోషన్ పొందే ఉద్యోగుల్లో ముఖ్య విభాగాల్లో పనిచేస్తున్న వారికి వారి బేసిక్ పే పెరుగుతుందని సమాచారం.
అయితే వార్షిక బోనస్‌లు, పనితీరు ఆధారిత ఈక్విటీ లాభాలపై నిర్ణయం మాత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో తీసుకోనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ వివరించింది.
వివరాలు
దాదాపు 19 వేల ఉద్యోగులను తొలగించిన యాక్సెంచర్
కోవిడ్ సమయంలో ఐటీ సేవలకు పెరిగిన డిమాండ్ దృష్ట్యా యాక్సెంచర్ కూడా ఇతర ఐటీ కంపెనీల మాదిరిగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించుకుంది.
అయితే 2023 నాటికి ఆ డిమాండ్ తక్కువయ్యింది. దాంతో ఆ సంవత్సరం యాక్సెంచర్ దాదాపు 19 వేల ఉద్యోగులను తొలగించింది.