టమాట కేజీ రూ.80కే అమ్ముతున్న కేంద్ర ప్రభుత్వం; ఎక్కడో తెలుసా?
టమాట ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యుల వంటింటిపై భారాన్ని తగ్గించేందుకు మరోసారి టమాట ధరలను సవరించింది. కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నుంచి కేజీ రూ.90 చొప్పున రాయితీపై దిల్లీతో పాటు కొన్ని ప్రముఖ నగరాల్లో మొబైల్ రిటైల్ కేంద్రాల ద్వారా టమాటాలను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు ఆదివారం నుంచి దిల్లీతో పాటు మరికొన్ని నగరాల్లోని రిటైల్ మార్కెట్లలో టమాటలను మరింత రాయితీకి విక్రయించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది. కేజీ టమాట రూ. 80కే విక్రయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రభుత్వ జోక్యంతో ఆకాశాన్నంటిన టమాట హోల్‌సేల్ ధరలు తగ్గుముఖం పట్టాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
దిల్లీలో మొబైల్ కేంద్రాల్లో ఒక్కరోజే 18వేల కిలోల టమాటాలు విక్రయం
నేషనల్ లెవల్ ఫార్మర్స్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఆర్గనైజేషన్(ఎన్ఏఎఫ్ఈడీ), నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్ ఫెడరేషన్ (ఎన్‌సీసీఎఫ్)ద్వారా దిల్లీ, నోయిడా, లక్నో, కాన్పూర్, వారణాసి, పాట్నా, ముజఫర్‌పూర్, ఆగ్రాలోని పలు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేసి టమాటాలను విక్రయిస్తోంది. అలాగే టమాట విక్రయ కేంద్రాలను మరిన్ని ప్రాంతాలను విస్తరిస్తామని కేంద్రం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో టమాట ధర శనివారం మారెట్లలో రూ. 250వరకు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి కేంద్రం ప్రత్యేక రిటైల్ కేంద్రాల ద్వారా రూ.80కే అందిస్తోంది. దిల్లీలో కేంద్రం ఏర్పాటు చేసిన మొబైల్ రిటైల్ కేంద్రాల ద్వారా శనివారం ఒక్కరోజే 18,000కిలోలు అమ్ముడవడం గమనార్హం.