Loading...
Adani Group Airlines Business: విమానయాన రంగంలోకి అదానీ.. ప్రభుత్వ అనుమతి కోరిన గ్రూప్!
విమానయాన రంగంలోకి అదానీ.. ప్రభుత్వ అనుమతి కోరిన గ్రూప్!

Adani Group Airlines Business: విమానయాన రంగంలోకి అదానీ.. ప్రభుత్వ అనుమతి కోరిన గ్రూప్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 28, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. కొంతకాలంగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఎయిర్‌లైన్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జుగేశిందర్‌ రాబీ సింగ్‌ వెల్లడించారు. శుక్రవారం ముంబైలో జరిగిన ఇండియా డెట్ క్యాపిటల్ మార్కెట్ సదస్సులో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో విమానయాన రంగానికి అపారమైన అవకాశాలున్నాయని జుగేశిందర్‌ సింగ్‌ అన్నారు. దేశంలో 60 కోట్లకు పైగా ప్రజలు విమాన ప్రయాణాలు చేసే సామర్థ్యం కలిగి ఉన్నారని పేర్కొన్నారు.

వివరాలు

పదిరెట్లు పెంచాలి

ఈ డిమాండ్‌ను అందుకోవాలంటే రోజువారీ విమాన సర్వీసుల సంఖ్యను పది రెట్లు పెంచి 30,000కు చేర్చాల్సి ఉంటుందని వివరించారు.

ఈ వృద్ధిలో అదానీ గ్రూప్ కూడా భాగస్వామి కావాలని భావిస్తున్నట్లు తెలిపారు.

ఎయిర్‌లైన్స్ రంగంలోకి నేరుగా సొంత సంస్థను ప్రారంభించడం ద్వారా లేదా ఇప్పటికే ఉన్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా ప్రవేశించే అవకాశం ఉందని సింగ్ సంకేతాలిచ్చారు.

కొత్తగా ఈ రంగంలోకి వచ్చే పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడం కూడా తమ పరిశీలనలో ఉందని వెల్లడించారు.

వివరాలు

ప్రయోజన వైరుధ్యంపై చర్చ

అయితే అదానీ గ్రూప్ నిర్ణయం ఇప్పుడు 'ప్రయోజన వైరుధ్యం' (Conflict of Interest) చర్చకు దారితీస్తోంది.

ఇప్పటికే అదానీ ఎయిర్‌పోర్ట్స్ హోల్డింగ్స్ ద్వారా ముంబై, అహ్మదాబాద్ సహా దేశంలోని ఎనిమిది కీలక విమానాశ్రయాలను ఈ గ్రూప్ నిర్వహిస్తోంది.

తాజాగా ఎయిర్‌లైన్స్ వ్యాపారంలోకి కూడా ప్రవేశిస్తే.. విమానాశ్రయాల నిర్వాహకులే విమానయాన సంస్థలతో పోటీ పడినట్లవుతుందని ఇండిగో, ఎయిర్ ఇండియా వంటి ప్రధాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ పరిణామం దీర్ఘకాలంలో ప్రయాణికుల ప్రయోజనాలకు నష్టం కలిగించవచ్చని వాదిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు

గతంలో భిన్నంగా స్పందించిన అదానీ గ్రూప్

విమానయాన రంగ ప్రవేశంపై అదానీ గ్రూప్ గతంలో వెల్లడించిన వైఖరికి తాజా ప్రకటన భిన్నంగా ఉండటం గమనార్హం.

ఈ ఏడాది జులైలో, అలాగే నవంబర్ 3న కూడా ఎయిర్‌లైన్ సంస్థను ప్రారంభించే ఉద్దేశం తమకు లేదని గ్రూప్ స్పష్టం చేసింది.

అయితే తాజాగా ప్రభుత్వ అనుమతి కోరినట్లు ప్రకటించడం సంస్థ వ్యూహంలో కీలక మార్పును సూచిస్తోంది.

ADVERTISEMENT

వివరాలు

స్పైస్‌జెట్‌ నేపథ్యంలో ప్రాధాన్యం

మరోవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న స్పైస్‌జెట్‌ సంస్థ నిధుల సమీకరణకు ప్రయత్నిస్తున్న సమయంలో అదానీ గ్రూప్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదే సమయంలో టాటా గ్రూప్ గురించి ప్రస్తావించిన జుగేశిందర్‌ సింగ్‌.. ఆ సంస్థ మరింతగా ఎదగాలని ఆకాంక్షించారు.

భవిష్యత్తులో ఫార్చ్యూన్ 500 కంపెనీల జాబితాలో సగం భారతీయ సంస్థలే ఉండాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు.

ADVERTISEMENT