Adani Shares: లాభాల్లో అదానీ స్టాక్స్.. భారీగా పెరిగిన అదానీ సంపద
స్టాక్ మార్కెట్లలో ఏ స్టాక్ ఎప్పుడు పెరుగుతుందో ముందుగా అంచనా వేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఇది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. చిన్న చిన్న ప్రకటనలు కూడా స్టాక్ ల పెరుగుదలకు దోహదపడతాయి. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. అదానీ గ్రూప్ షేర్లు కొన్ని రోజులుగా మంచి పనితీరు చూపిస్తున్నాయి. చాలావరకు స్టాక్స్ 6% పైగా పెరిగాయి. ఈ పరిస్థితి వల్ల, అదానీ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలు వస్తున్నాయని చెప్పొచ్చు. అదానీ పవర్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ విల్మర్ వంటి స్టాక్స్ పెరుగుతున్నాయి, ఇది వాటిలో పెట్టుబడుల సంఖ్యను కూడా పెంచుతోంది. కొనుగోళ్ల పెరుగుదలతో, స్టాక్స్ మరింత పెరిగిపోతున్నాయి.
రూపాయి తక్కువ ధరకు విద్యుత్
అదానీ గ్రూప్ చేసిన ప్రకటనే ఈ పెరుగుదలకు కారణం. పునరుత్పాదక ఇంధన వనరులు, బొగ్గు ఆధారిత 6600 మెగావాట్స్ విద్యుత్తును మహారాష్ట్రకు సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను అదానీ గ్రూప్ పొందింది. వారు యూనిట్‌కు రూ. 4.08 చొప్పున సరఫరా చేయాలని ఆఫర్ ఇచ్చారు, తద్వారా ఇతర సంస్థల బిడ్స్ (జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ యూనిట్‌కు రూ. 4.36, టోరెంట్ పవర్ యూనిట్‌కు రూ. 4.70) ను వెనక్కి నెట్టారు. ప్రస్తుతం, మహారాష్ట్రకు విద్యుత్ ధర యూనిట్‌కు రూ. 4.97 ఉన్నప్పటికీ, అదానీ కంపెనీ దాదాపు రూపాయి తక్కువ ధరకు విద్యుత్ అందించనుంది. ఈ కాంట్రాక్ట్ 25 సంవత్సరాల కాలానికి ఉంది.48 నెలల్లో విద్యుత్ సరఫరా ప్రారంభించాలి.
అదానీ టోటల్ గ్యాస్,ఏసీసీ, ఎన్‌డీటీవీ కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి
ఇందులో 5,000 మెగావాట్ల సౌర విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 2.70 చొప్పున అందించనున్నారు. బొగ్గు ధరల ఆధారంగా థర్మల్ విద్యుత్ ధరలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఈ పరిణామాలతో,అదానీ గ్రూప్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.ఆ సమయంలో,అదానీ పవర్ స్టాక్ 6.76% లాభంతో రూ.676.40 వద్ద ఉంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్ దాదాపు 1%పెరిగి రూ.991 వద్ద ట్రేడ్ అవుతోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ షేరు ధర 6.50% లాభంతో రూ. 1905 వద్ద కొనసాగుతోంది.అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఒక శాతం పైగా పెరిగి 3,000 మార్క్ వద్ద ఉంది. అదానీ విల్మర్ షేరు ధర 2% పైగా పెరిగి రూ. 368 వద్ద ట్రేడవుతోంది.అదానీ టోటల్ గ్యాస్,ఏసీసీ, ఎన్‌డీటీవీ కూడా లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.